Supreme Court On Religious Conversion : దేశంలో మోసపూరిత మతమార్పిళ్లను అరికట్టేలా కేంద్ర ప్రభుత్వానికి మార్గదర్శకాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. పిటిషనర్లపై అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. ఈ విషయంలో కోర్టులు ఎందుకు జోక్యం చేసుకోవాలని ప్రశ్నించింది. ఇలాంటి విషయాల్లో న్యాయస్థానాలు ప్రభుత్వానికి మాండమస్ రిట్‌లను ఎలా జారీ చేయవచ్చో చెప్పాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం చురకలు అంటించింది.
కర్ణాటకకు చెందిన న్యాయవాది జిరోమ్‌అన్టో హిందువులు, మైనర్లను మోసపూరిత మతమార్పిళ్లు చేయిస్తున్నారంటూ ఈ ప్రజాప్రయోజన వాజ్యాన్ని దాఖలు చేశారు. పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. పిల్ ఒక ఆటబొమ్మలా తయారైందని పేర్కొంది. ఇలాంటి వ్యాజ్యాలను ఎక్కడ విచారించాలని వాదనకు.. తామేం సలహాలు ఇచ్చేవాళ్లం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
లద్దాఖ్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు.. కొత్తగా జారీ చేయాలన్న సుప్రీం
Ladakh Hill Council Election : లద్దాఖ్ హిల్ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించి అక్కడి ఎన్నికల సంఘం ఆగస్టు 5న జారీ చేసిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఏడు రోజుల్లోగా కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించింది. నేషనల్ కాన్ఫరెన్స్‌కు నాగలి గుర్తును కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ లద్దాఖ్ పరిపాలనా శాఖ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. లద్దాఖ్ పరిపాలనా శాఖకు లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది.
లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌కు ఈనెల 10న ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తుపై పోటీ చేసేందుకు NC అభ్యర్థులను అనుమతిస్తూ ఏకసభ్య ధర్మాసనం ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. లద్దాఖ్ పరిపాలన శాఖ వేసిన పిటిషన్‌ను జమ్ముకశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు తోసిపుచ్చింది.
మణిపుర్ ఎడిటర్ గిల్డ్ సభ్యులకు సుప్రీం రక్షణ..
Manipur Editors Guild Case :మణిపుర్లో ఘర్షణలను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ అక్కడి పోలీసులు నమోదు చేసిన కేసులు ఎదుర్కొంటున్న ఎడిటర్స్ గిల్డ్‌లోని నలుగురు సభ్యులకు సుప్రీంకోర్టు రక్షణ కల్పించింది. సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఎడిటర్స్ గిల్డ్ దాఖలు చేసిన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం తమ స్పందనను తెలియజేయాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం సూచించింది. సెప్టెంబర్ 11వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.