ఆన్‌లైన్ మాధ్యమంలో నేరుగా విడుదలయ్యే వెబ్ సీరీస్, చిత్రాలు, ఇతర కార్యక్రమాలను ముందుగా పరిశీలించడానికి 'ప్రీ స్క్రీనింగ్ కమిటీ'ని ఎలా ఏర్పాట చేయగలమని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ మీర్జాపుర్ వాసి దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఓవర్-ది-టాప్ (ఓటీటీ)కి కూడా ప్రస్తుత చట్టం వర్తించాలని కోరవచ్చేగానీ ఇతర దేశాల నుంచి ప్రసారమయ్యేవాటిని అడ్డుకోవాలంటే అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతాయని పేర్కొంది. మరింత వివరంగా అర్జీని దాఖలు చేయాలని సూచిస్తూ, ప్రస్తుత పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించింది.
నళిని ముందస్తు విడుదలకు తమిళనాడు సుముఖం
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని హత్యచేసిన కేసులో దోషులు నళిని, ఆర్.పి.రవిచంద్రన్‌ల ముందస్తు విడుదలకు తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సుముఖత వ్యక్తపరిచింది. వీరి యావజ్జీవ కారాగార శిక్షను తగ్గిస్తూ 2018లో మంత్రివర్గ సలహాకు గవర్నర్ కట్టుబడి ఉండాలని పేర్కొంది.