Gyanvapi Supreme Court: జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగం దొరికిందని చెబుతున్న ప్రాంతానికి తగిన రక్షణ కల్పించాలని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముస్లింలు ఆ మసీదులో ప్రార్థనలు కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది. వారణాసి సివిల్ కోర్టులో జరుగుతున్న విచారణను నిలిపివేయాలని పిటిషనర్లు చేసిన అభ్యర్థనను మాత్రం సుప్రీం తోసిపుచ్చింది. మరోవైపు, మసీదులో వీడియో సర్వే చేయాలన్న వారణాసి కోర్టు ఆదేశాలను వ్యతిరేకిస్తూ అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ వేసిన పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని హిందూ భక్తులకు, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మే19లోగా స్పందన తెలియజేయాలని స్పష్టం చేసింది.
Gyanvapi Mosque case: అటు, వారణాసి కోర్టులో జ్ఞాన్‌వాపి మసీదు కేసు విచారణ కొనసాగింది. మసీదు ప్రాంగణంలో నిర్వహించిన వీడియోగ్రఫీ సర్వే నివేదికను సమర్పించేందుకు కమిషన్‌కు వారణాసి కోర్టు మరో రెండు రోజులు గడువిచ్చింది. నివేదిక పూర్తి కానందున అదనపు సమయం కావాలని కమిషన్.. కోర్టును కోరిన నేపథ్యంలో గడువు పొడిగించింది. మరోవైపు, న్యాయస్థానానికి సహకరించడం లేదనే కారణంతో అడ్వొకేట్ కమిషనర్ అజయ్ కుమార్ మిశ్రాను కమిషన్ నుంచి న్యాయస్థానం తొలగించింది. అసిస్టెంట్ కోర్టు కమిషనర్ అజయ్ ప్రతాప్ సింగ్‌ను నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
Gyanvapi Shivling found: జ్ఞాన్‌వాపి మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతామూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఐదుగురు మహిళలు ఇటీవల పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన వారణాసి కోర్టు.. మసీదు ప్రాంగణంలో వీడియోగ్రఫీ సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు మసీదు ప్రాంగణంలో ఈ నెల 14నుంచి 16వరకు కమిషన్ వీడియోగ్రఫీ సర్వే నిర్వహించింది. వీడియోగ్రఫీ సర్వే సందర్భంగా.. మసీదులోని బావిలో 12.8 అడుగుల పొడవైన శివలింగం కనిపించిందని హిందూ పిటిషనర్లు వారణాసి జిల్లా కోర్టును ఆశ్రయించగా, ఆ ప్రదేశాన్ని సీల్ చేయాల్సిందిగా అధికారులను న్యాయమూర్తి సోమవారం ఆదేశించారు. అయితే, అక్కడ కనిపించింది శివలింగం కాదని, అది ఫౌంటెయిన్‌లో భాగమని ముస్లిం పక్ష నేతలు వాదిస్తున్నారు.