Supreme Court On Freebies : ఎన్నికల్లో విజయం కోసం రాజకీయ పక్షాలు పోటీపడుతూ ప్రజలకు ఇస్తున్న అపరిమిత ఉచిత హామీలను కట్టడి చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణను త్రిసభ్య ధర్మాసనం చేపడుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన రిఫరెన్స్ ఆర్డర్ ప్రకారం ఉచిత హామీల వ్యాజ్యాలపై త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపాల్సి ఉంటుందని సీజేఐ తెలిపారు.
ఆ ధర్మాసనం చేపట్టే కేసుల జాబితాలో చేర్చేలా ఆదేశాలిచ్చేందుకు గాను సంబంధిత రికార్డులన్నీ తన ముందుంచాలని జస్టిస్ యు.యు.లలిత్ సూచించారు. ప్రాధాన్యం గల అంశమైనందున సత్వరమే విచారణకు వచ్చేలా చూస్తామన్నారు. విశాల ప్రజాహితం దృష్ట్యా ... నిర్హేతుకమైన ఉచిత హామీలు ఇవ్వకుండా నియంత్రణ విధించడం కోసం ఒక నిపుణుల కమిటీని నియమించాలని పిటిషనర్లలో ఒకరైన అశ్వినీ ఉపాధ్యాయ్ విజ్ఞప్తి చేశారు.
ప్రవాసులు, వలస కార్మికుల ఓటుహక్కుపై పిల్‌ల మూసివేత
పోస్టల్ బ్యాలెట్ విధానంలో లేదా తమ ప్రతినిధుల ద్వారా ఓటుహక్కును వినియోగించుకునేందుకు ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు), వలస కార్మికులను అనుమతించాలంటూ దాదాపు దశాబ్దం క్రితం దాఖలైన కొన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు మంగళవారం మూసివేసింది. వారిని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములుగా చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందంటూ అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి హామీ ఇవ్వడంతో ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. అటార్నీ జనరల్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇంకా సంబంధిత పిల్‌లను సాగదీయడంలో అర్థం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది.
సుఖ్‌బీర్‌సింగ్‌పై కేసు.. స్టే..
ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు పొందేందుకు శిరోమణి అకాలీదళ్ ఫోర్జరీ పత్రాలను సమర్పించిందంటూ ఆ పార్టీ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్, ఇతరులకు వ్యతిరేకంగా ట్రయల్‌కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. జస్టిస్ ఎస్‌ఏ నజీర్, జస్టిస్ వి.రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు మంగళవారం తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులకు సమన్లు జారీ చేస్తూ హొషియార్‌పుర్ అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు విచారించింది.
ఏడాదిన్నరపాటు కేసును ఎందుకు పక్కనపెట్టారు?
విచారణ చేపట్టేందుకు సిద్ధంగా ఉన్న ఓ కేసును దాదాపు ఏడాదిన్నరపాటు తమ రిజిస్ట్రీ పక్కనపెట్టడంపై సుప్రీంకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్నాళ్లూ దాన్ని ఎందుకు విచారణ కోసం లిస్టింగ్ చేయలేదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు ధిక్కరణ చట్టం-1971లోని ఓ నిబంధనకు సంబంధించి ఆర్.సుబ్రమణియన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ వ్యవహారంలో సుప్రీం ఈ మేరకు స్పందించింది.