నీట్ వైద్యవిద్య ప్రవేశాల్లో రిజర్వేషన్ల విషయంలో వార్షిక ఆదాయం రూ.8 లక్షలు, అంతకన్నా తక్కువగా ఉన్న వారిని ఆర్థికంగా వెనకబడిన తరగతుల(ఈడబ్ల్యూఎస్) వారిగా పరిగణించడంపై పునరాలోచిస్తామని సుప్రీంకోర్టుకు(Supreme court on neet reservation) కేంద్రం గురువారం తెలిపింది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్‌నాథ్ కూడిన ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.
ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారిని గుర్తించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసి, నాలుగు వారాల్లో తుది నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనానికి తుషార్ మెహతా తెలిపారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ గుర్తింపుపై ప్యానెల్ నివేదిక వచ్చే వరకు నాలుగు వారాలపాటు నీట్ కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తామని చెప్పారు.
అఖిల భారత కోటాలోకి వచ్చే సీట్లలో ఓబీసీలకు 27శాతం, ఈడబ్ల్యూఎస్‌కు 10శాతం రిజర్వేషన్లను వర్తింపజేయనున్నట్లు కేంద్రం జులై 29న ఉత్తర్వులు(Neet reservation criteria 2021) జారీ చేసింది. దీనిపై కేంద్రాన్ని, మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. నీట్ పోస్టు గ్రాడ్యుయేట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై న్యాయస్థానం మరోసారి విచారణ జరిపింది.
ఈడబ్ల్యూఎస్ కోటా శక్తిమంతమైన, ప్రగతిశీల రిజర్వేషన్ అని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్రానికి అన్ని రాష్ట్రాలు మద్దతు తెలపాలని అన్నారు. అయితే.. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వర్గీకరణ మాత్రం శాస్త్రీయమైన పద్ధతిలో జరగాలని ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో కేంద్రం పునరాలోచిస్తానని చెప్పడాన్ని ప్రశంసించింది.