ED Director Extension Supreme Court : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్- ఈడీ సంచాలకుడు సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మూడోసారి పొడిగించడం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆయన పదవీకాలం పొడిగింపు కుదరదని తెలిపింది. అయితే, తక్షణమే ఈడీ చీఫ్‌ను మార్చాలనే విషయంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న సుప్రీం.. మరో కొత్త వ్యక్తిని ఈడీ డైరెక్టర్‌గా నియమించేందుకు వీలుగా.. ఈనెల 31 వరకు సంజయ్ కుమార్ పదవిలో కొనసాగేందుకు వీలు కల్పించింది.
ED Director Tenure Extended : ఈడీ డైరెక్టర్‌గా ఎస్కే మిశ్రా రెండేళ్ల పదవీకాలానికి 19 నవంబర్ 2018 నవంబర్‌లో నియమితులయ్యారు. ఆ తర్వాత ఆయన పదవీకాలాన్ని ఏడాదిపాటు కేంద్రం పొడిగించింది. అనంతరం గతేడాది నవంబర్‌లో ఆయన పదవీకాలం ముగియగా.. ముచ్చటగా మూడోసారి పొడిగిస్తూ 2022 నవంబర్ 17న కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. ఈడీ, సీబీఐ చీఫ్‌ల పదవీకాలాన్ని తప్పనిసరి ఐదేళ్ల వరకు పొడిగించేలా గతేడాది కేంద్రం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఎస్కే మిశ్రా 18 నవంబర్ 2023 వరకు పదవిలో కొనసాగేవారు.
ED Director Supreme Court : అయితే మూడో సారి ఈడీ డైరెక్టర్ పదవీకాలం పొడిగింపును వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్ నేతలు రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా, జయ ఠాకూర్, తృణమూల్ కాంగ్రెస్ నేతలు.. మహువా మొయిత్రా, సాకేత్ గోఖలే సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. తన రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలను దుర్వినియోగం చేయడం ద్వారా.. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యం మౌలిక స్వరూపాన్ని నాశనం చేసిందని జయ ఠాకూర్ తన పిటిషన్లో ఆరోపించారు. దీనిపై సుప్రీం కోర్టు.. కేంద్ర విజిలెన్స్ కమిషన్, ఈడీ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది.
ఈ కేసులో తమ స్పందన తెలియజేయాలని చివరిసారిగా గతేడాది డిసెంబర్లో కేంద్రంతో పాటు ఈ కేసుకు సంబంధించిన ఇతరులను ఆదేశించింది సుప్రీంకోర్టు. ఆ తర్వాత పిటిషన్లపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం.. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ అత్యున్నత సమావేశం నిర్వహిస్తున్న దృష్ట్యా.. ఆ సమావేశం సజావుగా సాగేందుకు మే నెలలో తీర్పును రిజర్వు చేసింది. ఎస్కే మిశ్రా పదవీ కాలం జులై 31వ తేదీ వరకే ఉంటుందని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రం నాథ్, జస్టిస్ సంజయ్ కరోల్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది.