Supreme Court On Divorce :దంపతుల మధ్య వివాహ బంధం పునరుద్ధరించలేని విధంగా విచ్ఛిన్నమైతే.. ఆ కారణం కింద వారి పెళ్లి రద్దు చేసి విడాకులు మంజూరు చేయడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం దంపతుల మధ్య వివాహ బంధం పునరుద్ధరించలేని విధంగా విచ్ఛిన్నమైతే విడాకుల మంజూరు వాంఛనీయం కాదని పేర్కొంది. కోర్టులో విడాకుల కేసులు పెరుగుతున్నప్పటికీ.. వివాహం అనేది భారతీయ సమాజంలో భార్యాభర్తల మధ్య పవిత్రమైన, ఆధ్యాత్మికమైన, భావోద్వేగ జీవిత వలయంగా పరిగణిస్తారని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది.
తన 82ఏళ్ల భార్య నుంచి విడాకులు ఇప్పించాలని 89ఏళ్ల వృద్ధుడు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బీఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా తన భర్తతో వివాహ బంధంలో కొనసాగాలని వృద్ధురాలు తన కోరికను ధర్మాసనం ముందుంచింది. ఈ క్రమంలో కోర్టు వృద్ధ దంపతులకు విడాకులు ఇచ్చేందుకు నిరాకరించింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం ఈ వృద్ధ దంపతులకు విడాకులు మంజూరు చేయడం మంచిది కాదని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బీ.ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. ఈ పిల్ దాఖలు చేసిన పిటిషనర్ వయసు 89 ఏళ్లు, ఆయన భార్యకు 82 ఏళ్లు అని.. 1963 నుంచి ఈ దంపతులు పవిత్రమైన వివాహ బంధంలో ఉన్నారని తెలిపింది. భర్త ఆమె పట్ల క్రూరంగా ప్రవర్తించినా వృద్ధురాలు తన ముగ్గురు పిల్లలను బాగా చూసుకుందని వెల్లడించింది. భార్య తన భర్తను చూసుకోవడానికి ఇంకా సిద్ధంగానే ఉందని.. ఈ దశలో అతడిని ఒంటరిగా వదిలేయడం ఆమెకు ఇష్టం లేదని ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది.