తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉరి శిక్ష వద్దు.. తుపాకీతో కాల్చితే బెటర్!.. కరెంట్ షాక్ ఎలా ఉంటుంది?' - ఉరి శిక్ష సుప్రీంకోర్టు విచారణ

కరుడుగట్టిన ఖైదీలకు ఉరి శిక్ష అమలుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నొప్పి కలగకుండా మరణం సంభవించే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని కేంద్రాన్ని ఆదేశించింది. గౌరవకర మరణం చాలా ముఖ్యమైన అంశమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఉరి శిక్షకు బదులు ప్రత్యామ్నాయ మార్గాలపై కమిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

supreme court on death sentence
supreme court on death sentence

By

Published : Mar 21, 2023, 5:28 PM IST

దోషులకు మరణ శిక్ష అమలు చేసేందుకు ఉరి కాకుండా.. తక్కువ బాధ కలిగించే ప్రత్యామ్నాయాల వైపు కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఉరి చాలా బాధాకరమైన ముగింపు అన్న ధర్మాసనం... దీనికంటే తక్కువ బాధ కలిగించే మరణ శిక్ష అమలుపై చర్చలు ప్రారంభించాలని పేర్కొంది. ఇందుకు సంబంధించిన అవసరమైన సమాచారాన్ని సేకరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీనిపై సమాచారంతో తిరిగి కోర్టుకు రావాలని అటార్నీ జనరల్ వెంకటరమణికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉరి శిక్ష పడ్డ ఖైదీలకు నొప్పి లేకుండా జీవితాన్ని ముగించే అవకాశం ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ మేరకు స్పందించింది.

విచారణ సందర్భంగా ధర్మాసనం.. ఉరిశిక్షకు బదులుగా ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించింది. ఉరి శిక్ష అమలు ప్రత్యామ్నాయాలపై నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్న సర్వోన్నత న్యాయస్థానం.. తుపాకీతో కాల్చడం, ప్రాణాంతక ఇంజెక్షన్ ఇవ్వడం, విద్యుత్ కుర్చీ వంటి వాటిని పరిశీలించాలని కేంద్రానికి సూచించింది.

ఉరి శిక్ష చాలా క్రూరమైనదన్న లా కమిషన్ నివేదికను పిటిషన్‌ తరపు న్యాయవాది రిషి మల్హోత్రా ధర్మాసనం ముందు చదివి వినిపించారు. ఉరి శిక్ష క్రూరమైనదని అంగీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. దీనిపై తమకు కొంత శాస్త్రీయ సమాచారం కావాలని వ్యాఖ్యానించింది. ఉరి వల్ల కలిగే నొప్పిపై అధ్యయన సమాచారాన్ని ఇవ్వాలని అటార్నీ జనరల్‌ను కోరిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్.. దాని ఆధారంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అమెరికాలో మరణ శిక్షకు ప్రాణాంతక ఇంజెక్షన్‌ విధానాన్ని అవలంబిస్తున్నారని.. అందులో ఏ రసాయనాన్ని ఉపయోగిస్తారనే దానిపై కూడా పరిశోధన చేయాలని జస్టిస్ నరసింహ సూచించారు.

"ఈ విషయాన్ని శాస్త్ర, సాంకేతిక కోణంలో చూడాలి. ప్రస్తుత శాస్త్ర పరిజ్ఞానం ప్రకారం.. ఉరిశిక్షే ఉత్తమమైన పద్ధతా? అన్నది తెలుసుకోవాలి. ప్రత్యామ్నాయ పద్ధతులపై దేశ, విదేశాల్లో ఏదైనా సమాచారం ఉందా? దీనిపై కమిటీ వేద్దామా? అనే విషయంపై మేం లోతుగా ఆలోచిస్తున్నాం. కమిటీలో నేషనల్ లా యూనివర్సిటీలను చేర్చుకోవచ్చు. దిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీలో మంచి నిపుణులు ఉన్నారు."
-సుప్రీంకోర్టు

ప్రాణాంతకమైన ఇంజెక్షన్ ద్వారా మరణ శిక్ష అమలు కూడా చాలా బాధాకరమని సీజేఐ అభిప్రాయపడ్డారు. తుపాకీతో కాల్పడం మానవ హక్కులను పూర్తిగా ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించారు. ఉరి శిక్ష కాకుండా మరో పద్ధతిని అవలంబిస్తే అది రాజ్యాంగ విరుద్ధమవుతుందేమో చూడాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. మరణంలో గౌరవం.. తక్కువ నొప్పి కలిగించడం అనే అంశాలు ముఖ్యమైనవని జస్టిస్‌ పీఎస్‌ నరసింహ అభిప్రాయపడ్డారు. అనంతరం విచారణను మే రెండో తేదీకి వాయిదా వేశారు.

ABOUT THE AUTHOR

...view details