కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న టీకాల(Vaccine) విధానంలో పలు లోపాలు ఉన్నాయని సుప్రీంకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. వివిధ అంశాలను ప్రస్తావిస్తూ కేంద్రానికి సూటిగా ప్రశ్నలు వేసింది. ధరల్లో తేడాలు, టీకాల కొరత, గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులో లేకపోవడం తదితర అంశాలను ప్రస్తావించింది. మందులు, టీకాలు(Vaccine), ఆక్సిజన్ సరఫరాపై తనకుతానుగా కేసు విచారిస్తున్న న్యాయస్థానం.. అధికార యంత్రాంగం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ కేసును జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. కరోనా మూడో అల (థర్డ్ వేవ్)లో పిల్లలు, గ్రామీణ ప్రాంతాల వారు అధికంగా ప్రభావితమవుతారన్న వార్తలు వస్తున్నాయని, దీనిపై ఏమైనా అధ్యయనం చేశారా? అని ప్రశ్నించింది. ఇందు కోసం అనుసరించనున్న వ్యాక్సిన్(Vaccine) విధానం ఏమిటని అడిగింది.
నిజాలు చెప్పినా కేసులా?
సమస్యలను సామాజిక మాధ్యమాల ద్వారా చెబుతున్న వారిపై క్రిమినల్ కేసులు పెడుతుండడాన్ని తప్పుపట్టింది. కరోనా కారణంగా మృతి చెందిన వ్యక్తి శవాన్ని నదిలో విసిరివేస్తున్న వైనాన్ని ప్రచారం చేసిన టీవీ ఛానల్‌పైనా దేశద్రోహం కేసు పెడతారా ఏమిటి? అని వ్యాఖ్యానించింది. వీటన్నింటికీ రెండు వారాల్లో సమాధానాలు ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
క్షేత్ర స్థాయి వాస్తవాలను గమనించాలి
విధానరూపకర్తలు క్షేత్రస్థాయి వాస్తవాలను గమనించాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. టీకాల(Vaccine) కోసం కొవిన్(cowin) యాప్‌లో నమోదు చేయించుకోవాలన్న నిబంధనను ప్రశ్నించింది. మారుమూల ప్రాంతాల వారికి, వలస కార్మికులకు ఈ డిజిటల్ సౌకర్యం ఉంటుందా అని అడిగింది. ఇందుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమాధానం చెబుతూ గ్రామీణ ప్రాంతాల్లోని కమ్యూనిటీ సెంటర్ల ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ఇది ఆచరణ సాధ్యమేనా అని ప్రశ్నించింది. కోర్టు సహాయకురాలు (అమికస్ క్యూరీ)గా వ్యవహరిస్తున్న మల్లికా అరోడా ఓ ఉదాహరణ చెబుతూ "కొవిన్‌లో(cowin) పేరు నమోదు చేసుకుంటే ప్రయివేటు ఆస్పత్రి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఒకరికి టీకా వేయడానికి రూ.900 చెల్లించాలని అడిగారు. ఈ లెక్కన ఒక కుటుంబానికి పెద్ద మొత్తమే ఖర్చవుతుంది" అని అన్నారు.