తెలంగాణ

telangana

By

Published : Feb 3, 2023, 5:57 PM IST

ETV Bharat / bharat

'15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాం.. పెళ్లికి చట్టబద్ధత ఇవ్వండి'.. ఇద్దరు అబ్బాయిల పిటిషన్

తాము గత 15 ఏళ్లుగా ప్రేమబంధంలో ఉన్నామని.. తమ పెళ్లికి చట్టబద్ధత కల్పించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఓ స్వలింగ సంపర్క జంట. వీరి పిటిషన్‌ గురించి విన్న మరో 3 స్వలింగ సంపర్కుల జంటలు తమ పెళ్లికి కూడా అనుమతినివ్వాలని అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశాయి.

supreme court on bisexual marriage
supreme court on bisexual marriage

భారత్‌లో ఇప్పుడిప్పుడే స్వలింగ సంపర్కులు బహిరంగంగా లైంగిక ధోరణిని వెల్లడిస్తున్నారు. స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో చాలా మంది LGBTQ కమ్యూనిటీకి చెందిన జంటలు బయటికి వచ్చి తమ హక్కుల కోసం పోరాడుతున్నాయి. తమపై వేధింపులు ఆపి రక్షణ కోసం చట్టాలు చేయాలని.. వివాహం చేసుకోవడానికి అనుమతినివ్వాలని కోరుతున్నాయి. ఇదే కోవలోకి చెందిన ఓ జంట గత 15 ఏళ్లుగా ప్రేమబంధంలో ఉంటూ.. పెళ్లికి చట్టబద్ధత కల్పించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఉత్కర్ష్‌ సక్సేనా, అనన్య కోటియా

ఇక్కడ కనిపిస్తున్న వీరిద్దరి పేర్లు ఉత్కర్ష్‌ సక్సేనా, అనన్య కోటియా. మనదేశానికే చెందిన ఈ ఇద్దరూ విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌లో పబ్లిక్ పాలసీ స్కాలర్‌గా ఉత్కర్ష్‌ చదువుతుండగా.. అనన్య లండన్ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో ఎకనామిక్స్ స్కాలర్‌గా ఉన్నాడు. స్వలింగ సంపర్క వివాహం చేసుకునేందుకు అనుమతినివ్వాలని వీరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం వల్ల దేశవ్యాప్తంగా LGBTQ కమ్యూనిటీపై మరోసారి చర్చకు తెరలేచింది. ఉత్కర్ష్, అనన్య దాఖలు చేసిన పిటిషన్‌ గురించి విన్న మరో 3 స్వలింగ సంపర్కుల జంటలు తమ పెళ్లికి కూడా అనుమతి నివ్వాలని అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. వీటన్నింటినీ మార్చిలో సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. భారత్‌ లాంటి దేశంలో ఇలాంటి వివాహాలకు అనుమతి లభించడం వాటికి చట్టబద్ధత కల్పించడం కష్టమని భావించిన ఈ జంట న్యాయపరంగా పోరాటం సాగిస్తోంది. ఈ వివాహాలకు చట్టబద్ధత లభిస్తే.. తైవాన్ తర్వాత స్వలింగ సంపర్క వివాహాలను చట్టబద్ధం చేసిన రెండో ఆసియా దేశంగా భారత్ నిలవనుంది. వీరి బంధానికి ఇరువురి కుటుంబాల్లోని చాలామంది బంధువులు, స్నేహితులు అడ్డుచెప్పలేదని ఉత్కర్ష్‌, అనన్య తెలిపారు.

ఉత్కర్ష్‌ సక్సేనా, అనన్య కోటియా

2014లో ట్రాన్స్‌జెండర్లను గుర్తిస్తూ చట్టబద్ధత కల్పించారు. నాలుగేళ్ల క్రితం స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దీని తర్వాత మన దేశంలోనూ తామూ స్వలింగ సంపర్కులమని సమాజానికి బహిరంగంగా చెప్పుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ సంఖ్య 2013 నుంచి 2019 వరకు 22 శాతం నుంచి 37శాతానికి పెరిగినట్లు ఓ సర్వే తెలిపింది. సుప్రీంకోర్టు జోక్యంతో భారత్‌లో LGBTQ కమ్యూనిటీకి ఉన్న హక్కులు విస్తరిస్తున్నాయి. స్వలింగ సంపర్కుల వివాహానికి అనుకూలంగా తీర్పు వస్తే LGBTQ కమ్యూనిటీకి హక్కులు కల్పించిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలవనుంది. ఇదే సమయంలో స్వలింగ సంపర్కం చేస్తే 10ఏళ్ల జైలు శిక్ష విధించే వలసవాదం నాటి చట్టాన్ని 2018లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే కేంద్రంలోని భాజపా సర్కార్‌.. ఈ స్వలింగ సంపర్క వివాహాలను వ్యతిరేకిస్తోంది. ఈ వివాహాలు దేశంలోని వ్యక్తిగత చట్టాల సమతుల్యతను దెబ్బతీస్తాయని ప్రభుత్వం వాదిస్తోంది. దీంతో ప్రభుత్వ వాదనను సవాల్ చేయవచ్చని కోర్టు పేర్కొంది.

ఉత్కర్ష్‌ సక్సేనా, అనన్య కోటియా

మరోవైపు.. స్వలింగ సంపర్క న్యాయమూర్తిని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలన్న ప్రతిపాదనను జనవరిలో ప్రభుత్వం వ్యతిరేకించిందని కొలీజియం పేర్కొంది. ఈ ఆరోపణలపై కేంద్రం స్పందించలేదు. స్వలింగ సంపర్కుల వివాహాలను వ్యతిరేకించడం అంటే పౌరులకు ఉన్న సమానత్వపు హక్కును హరించడమేనని వారు వాదిస్తున్నారు. అటు.. LGBTQ కమ్యూనిటీ కూడా భారత సమాజంలో ఒక భాగమని.. భాజపాకు అనుబంధంగా ఉన్న RSS అధిపతి మోహన్ భగవత్ వ్యాఖ్యానించడం గమనార్హం. కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇస్తే బాగుంటుందని ఉత్కర్ష్‌, అనన్యా ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి :స్కూల్​ యూనిఫాంలో ఎమ్మెల్యేలు.. బ్యాగ్స్​తో అసెంబ్లీకి సైకిల్​ సవారీ

పెట్రోల్​ ధర రూ.2 పెంపు.. కొత్త కార్లపై మరింత ట్యాక్స్​.. రాష్ట్ర బడ్జెట్​లో సామాన్యులకు షాక్​!

ABOUT THE AUTHOR

...view details