Baba Ramdev Questions on Allopathy: అల్లోపతి లాంటి ఆధునిక వైద్య విధానాలను విమర్శిస్తూ ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆయన అనుసరించే విధానాలు అన్ని రోగాలను నయం చేస్తాయన్న గ్యారెంటీ ఏమైనా ఉందా? అని ప్రశ్నించింది.
రాందేవ్ బాబాపై సుప్రీంకోర్టు అసహనం, ఆ గ్యారంటీ ఉందా అని సీజేఐ ప్రశ్న - సుప్రీంకోర్టు బాబా రాందేవ్
ఆధునిక వైద్యాన్ని విమర్శిస్తూ యోగా గురువు రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. యోగాకు ఆయన ప్రాచుర్యం కల్పించారని.. కానీ ఇతర వ్యవస్థలను విమర్శించడం సరికాదని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఆయన అనుసరిస్తున్న విధానాలు అన్నింటినీ నయం చేస్తాయన్న గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు.
అల్లోపతి వైద్యులు, ఔషధాలు, కొవిడ్ వ్యాక్సినేషన్‌కు వ్యతిరేకంగా జరుగుతోన్న విస్తృత ప్రచారాలపై భారత వైద్య మండలి (ఐఎంఏ) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. అల్లోపతిపై రాందేవ్ బాబా విమర్శలను ప్రస్తావించింది. "అల్లోపతి వైద్యులపై రాందేవ్ బాబా ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు. ఆయన యోగాకు ప్రాచుర్యం కల్పించారు మంచిదే..! కానీ, ఇతర వ్యవస్థలను ఆయన విమర్శించకూడదు. ఆయన అనుసరిస్తున్న విధానాలు అన్నింటినీ నయం చేస్తాయన్న గ్యారెంటీ ఏంటీ?" అని జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఐఎంఏ పిటిషన్‌పై తమ స్పందన తెలియజేయాలంటూ కేంద్రానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
గతేడాది కొవిడ్ రెండో దశ విజృంభణ సమయంలో అల్లోపతి వైద్యంపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే. 'అల్లోపతి పనికిమాలిన వైద్యం' అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో ఓ వీడియో అప్పట్లో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో భారత వైద్య మండలితో పాటు అప్పటి కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లోపతి వైద్య విధానాన్ని ఆయన కించపరుస్తున్నారంటూ వైద్య మండలి మండిపడింది. ఇది కాస్తా తీవ్ర వివాదాస్పదం కావడంతో రాందేవ్ బాబా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. మరోవైపు, రాందేవ్‌కు వ్యతిరేకంగా పలు న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి.