తెలంగాణ

telangana

ETV Bharat / bharat

SC on Viveka Case: "వివేకా హత్య కేసు వివరాలు, డైరీ సీల్డ్‌ కవర్‌లో అందించండి".. సీబీఐకి సుప్రీం ఆదేశం - Supreme court on Avinash Reddy bail petition

SC on Viveka Case
SC on Viveka Case

By

Published : Jul 18, 2023, 11:33 AM IST

Updated : Jul 18, 2023, 4:41 PM IST

11:30 July 18

సెప్టెంబర్‌ రెండో వారంలో విచారణ చేపడతామన్న సుప్రీంకోర్టు

SC on Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ8గా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సునీత నర్రెడ్డి దాఖలు చేసిన కేసులో.. సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో.. జూన్ 30న దాఖలు చేసిన ఛార్జిషీట్‌, కేసు డైరీని సీల్డ్ కవర్లో సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. అలాగే అవినాష్‌ ముందుస్తు బెయిల్‌ వ్యవహారంపై రెండు వారాల్లోపు రిప్లై దాఖలు చేయాలని కేంద్ర దర్యాప్తు సంస్థను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం.త్రివేదీలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. అదే విధంగా.. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటికే ఉన్న ఆదేశాలు అన్ని యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను కూడా అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ రద్దు పిటిషన్‌కు జత చేసింది. రెండు పిటిషన్లు కలిపే తదుపరి విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం తేల్చి చెప్పింది.

రెండూ కలిపే విచారిస్తాం: వాస్తవానికి ఎర్ర గంగిరెడ్డి జూన్ 30 కల్లా బయటికి రావాల్సి ఉందని ఆయన తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురాగా.. దానికి జస్టిస్ సంజీవ్‌ఖన్నా స్పందిస్తూ ఆ ఉత్తర్వులపై ఇది వరకే సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని, ఇది హత్య కేసు అన్న విషయం అందరికీ తెలుసని.. ఇందులో కచ్ఛితంగా నేర తీవ్రత ఉందని, హత్య కేసులో సాక్ష్యాధారాలు ఉన్నాయా? లేదా? అన్నది ముఖ్యం అని గంగిరెడ్డి తరుపు న్యాయవాదిని ఉద్దేశించి న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. తమ కేసును అవినాష్‌ రెడ్డి కేసుతో కలపకుండా, ప్రత్యేకంగా విచారించాలని గంగిరెడ్డి తరపు న్యాయవాది కోరగా అందుకు జస్టిస్ సంజీవ్ ఖన్నా నిరాకరించారు. తాము రెండూ కలిపే విచారిస్తామని స్పష్టం చేశారు. సునీత దాఖలు చేసిన పిటిషన్​లో గంగిరెడ్డి, సీబీఐ సమాధానాలు దాఖలు చేయడానికి రెండు వారాల సమయం ఇచ్చారు. అలాగే బెయిల్‌ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ గంగిరెడ్డి దాఖలు చేసిన కేసులో సునీత, సీబీఐకి నోటీసులు జారీ చేస్తూ.. మూడు వారాల్లోపు రిప్లై దాఖలు చేయాలని ఆదేశించారు. ఈ కేసుల తదుపరి విచారణను సెప్టెంబర్ 11 నుంచి మొదలయ్యే వారానికి వాయిదా వేశారు.

వివేకా కుమార్తె దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ ప్రారంభమైన వెంటనే సునీత తరుపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్​ లూద్రా వాదనలు వినిపిస్తూ.. తాము అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఒక పిటిషన్‌, ఈ కేసు దర్యాప్తును ట్రయల్ కోర్టు పర్యవేక్షించేలా చూడాలని కోరుతూ మరో పిటిషన్‌ దాఖలు చేసినట్లు చెప్పారు. అయితే విషయం సుప్రీంకోర్టు పెండింగ్‌లో ఉన్నందున కేసు దర్యాప్తు పర్యవేక్షణ అంశాన్ని పరిశీలించలేమని ట్రయల్ కోర్టు చెబుతోందని, అందువల్ల దానిపై స్పష్టత కోరుతూ అప్లికేషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఈ కేసులో సీబీఐ తాను దాఖలు చేసిన ఛార్జిషీట్ కాపీని సమర్పించడం కానీ, కౌంటర్ దాఖలు చేయడం కానీ చేయలేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

స్పష్టమైన సమాధానం ఇవ్వని సీబీఐ: ఈ సందర్భంలో.. జస్టిస్ సంజీవ్‌ ఖన్నా జోక్యం చేసుకుంటూ సీబీఐ తరుపున ఎవరు హాజరవుతున్నారని ప్రశ్నించగా... అందుకు ఆ సంస్థ తరుపున హాజరైన ప్యానల్ న్యాయవాది స్పందిస్తూ.. ఇది వరకు ఇచ్చిన ఆదేశాల మేరకు జూన్ 30వ తేదీ లోపు తాము ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు చెప్పారు. అయితే ఆ విషయం రికార్డులో లేదన్నారు. దీనికి.. న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా స్పందిస్తూ మీరు ఇక్కడ ఛార్జిషీట్ కాపీ దాఖలు చేశారా.. అని ప్రశ్నించగా.. లేదని సీబీఐ న్యాయవాది సమాధానం ఇచ్చారు. వెంటనే కాపీ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. అలాగే అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు కేసులో సీబీఐ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉందని, అందుకు రెండు వారాల సమయం కావాలని ఆ సంస్థ తరుపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. అప్పుడు జస్టిస్ సంజీవ్ ఖన్నాజస్టిస్ బేలా ఎం. త్రివేదీ జోక్యం చేసుకుంటూ మీరు హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేశారా... అని సీబీఐ న్యాయవాదిని ప్రశ్నించగా... ఇప్పటి వరకూ చేయలేదని ఆయన బదులిచ్చారు. మీరు దాన్ని సవాల్ చేయబోతున్నారా? అని జస్టిస్ సంజీవ్ ఖన్నా మళ్లీ సీబీఐని ప్రశ్నించగా అందుకు న్యాయవాది స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.

ఆశ్చర్యం కలిగిస్తోంది: సునీత తరుపు న్యాయవాది జోక్యం చేసుకుంటూ సీబీఐ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ చాలా విస్పష్టంగా ఉందని, కానీ వాళ్లు ఇక్కడ ఎందుకు కౌంటర్ దాఖలు చేయడం లేదో ఆశ్చర్యం కల్గిస్తోందని అన్నారు. హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్‌ను రికార్డులోకి తీసుకోవాలని, అందులో వారు ఏం చేయదలచుకున్నదీ స్పష్టంగా ఉందని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఈ వాదనలు విన్న అనంతరం జస్టిస్ సంజీవ్​ ఖన్నా జోక్యం చేసుకుంటూ ఈ కేసులో కౌంటర్​తో పాటు, ఛార్జిషీట్ కాపీ దాఖలు చేయాలని సీబీఐ తరుపు న్యాయవాదిని ఆదేశించారు. ఈ సందర్భంలో సునీత తరుపు న్యాయవాది సిద్దార్ధ లూద్రా మరోసారి జోక్యం చేసుకుంటూ కేస్ డైరీ కూడా దాఖలు చేసేలా ఆదేశించాలని కోరారు. దీనికి అవినాష్‌ రెడ్డి తరపు సీనియర్ న్యాయవాది రంజిత్‌ కుమార్ జోక్యం చేసుకుంటూ ఇప్పటికే సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీటు ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకొని తమను ఆగస్టు 14న హాజరుకావాలని నోటీసులు జారీ చేయగా.. ఆరోజు కోర్టు ముందుకు వెళుతున్నట్లు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అందుకు జస్టిస్ సంజీవ్‌ ఖన్నా... జోక్యం చేసుకుంటూ ఈరోజు తాము ఎలాంటి ఆదేశాలూ జారీ చేయడం లేదని, ఇప్పటివరకు ఏవైతే ఆదేశాలు అమలులో ఉన్నాయో అవన్నీ కొనసాగుతాయని స్పష్టం చేశారు.

తదుపరి అందరి వాదనలూ వింటామని పేర్కొన్నారు. అప్పుడు మరోసారి లూథ్రా జోక్యం చేసుకుంటూ... ఛార్జిషీట్, కేస్ డైరీ రెండింటినీ దాఖలు చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరారు. ఛార్జిషీట్‌లోకి రాని చాలా అంశాలు కేస్ డైరీలో ఉంటాయని, అందువల్ల దాన్ని తెప్పించుకొని పరిశీలిస్తే పూర్తి విషయాలు తెలుస్తాయని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. దీనికి అవినాష్ రెడ్డి తరుపున న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేయగా.. న్యాయమూర్తి దాన్ని తోసిపుచ్చారు. దాన్ని తాము పిటిషనర్‌కు ఇవ్వడం కోసం కాదని, కేవలం స్వీయ పరిశీలన కోసం సమర్పించమని చెబుతామని పేర్కొంటూ.. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్ 11 నుంచి మొదలయ్యే వారంలో చేపట్టనున్నట్లు ప్రకటిస్తూ... వాయిదా వేసింది.

Last Updated : Jul 18, 2023, 4:41 PM IST

ABOUT THE AUTHOR

...view details