Supreme Notices to MP Avinash Reddy: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మే 31న తెలంగాణ హైకోర్టు ఆయనకు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ఆదేశాలను సవాల్ చేస్తూ వివేకా కుమార్తె సునీతా నర్రెడ్డి సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం.. అవినాష్‌కు నోటీసులు ఇచ్చింది. సునీత పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను జులై 3కి వాయిదా వేసింది.
Notices to MP Avinash: కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
11:54 June 19
సునీత పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని అవినాష్‌కు నోటీసులు
ముందస్తు బెయిల్ మంజూరు: వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు (మే 31) బుధవారం షరతులతో ముందస్తు బెయిలు మంజూరు చేసింది. ఈ మేరకు అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతించింది. సీబీఐకి రూ.5 లక్షలకు వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని, దర్యాప్తు పూర్తయ్యేవరకూ సీబీఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని, సాక్షులను ప్రభావితం చేయరాదని, సాక్ష్యాలను తారుమారు చేయరాదని ఆదేశించింది. సీబీఐ దర్యాప్తునకు సహకరించాలని, జూన్ నెలాఖరు వరకు ప్రతి శనివారం ఉదయం 10 నుంచి 5 గంటల వరకు, దర్యాప్తు నిమిత్తం అవసరమైనపుడల్లా సీబీఐ ముందు హాజరు కావాలని ఆదేశించింది. నిష్పాక్షిక, సత్వర దర్యాప్తునకు అడ్డంకులు కలిగించేలా ఎలాంటి చర్యలూ చేపట్టరాదంది. వీటికి భిన్నంగా అవినాష్‌రెడ్డి వ్యవహరిస్తే ముందస్తు బెయిలును రద్దు చేయాలని సీబీఐ కోరవచ్చంది.
అలా అరెస్ట్.. ఇలా విడుదల:తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు వ్యవహరించిన సీబీఐ..అవినాష్ రెడ్డిని ఈ నెల 3వ తేదీన అరెస్టు చేసి.. 5లక్షల రూపాయలు, ఇద్దరి పూచికత్తుపై ఆరోజే విడుదల చేసింది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా ఈ విషయం అటు సీబీఐ అధికారులు, అవినాష్ రెడ్డి గోప్యంగా ఉంచడం గమనార్హం.
ఏ8గా అవినాష్:వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని కేంద్ర దర్యాప్తు సంస్థ 8వ నిందితుడిగా చేర్చింది. ఇప్పటికే అరెస్ట్ అయిన ఆయన తండ్రి భాస్కరరెడ్డిని 7వ నిందితుడిగా పేర్కొంది. భాస్కరరెడ్డి బెయిలు పిటిషన్‌పై సీబీఐ దాఖలు చేసిన కౌంటరులో ఈ మేరకు పలు విషయాలను వెల్లడించింది. మౌఖిక, పత్ర సహిత, శాస్త్రీయ, వైద్యపరమైన ఆధారాల ప్రకారం.. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి హత్య పథకాన్ని అమలు చేసినట్లు వెల్లడించింది. సాక్ష్యాలను ధ్వంసం చేసి, గుండెపోటుతో వివేకా మృతి చెందారని నమ్మించడంలో ప్రతిపాదిత నిందితులు భాస్కరరెడ్డి, అవినాష్‌రెడ్డి, నిందితులు శివశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి కలిసి కుట్రను ముందుకు తీసుకెళ్లారని కోర్టుకు నివేదించింది.