తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా గవర్నర్​ నిర్ణయం తప్పే.. కానీ ఉద్ధవ్​ రాజీనామా చేయకుంటే..' - ఉద్దవ్​ ఠాక్రే సుప్రీం కోర్టు

మహారాష్ట్ర శాసనసభలో బలపరీక్ష ఎదుర్కొనకుండా రాజీనామా చేసిన ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వాన్ని తిరిగి పునరుద్ధరించలేదని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే బల నిరూపణ చేసుకోవాలని ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వాన్ని ఆదేశించటాన్ని గవర్నర్‌ సమర్థించుకోలేరని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.

sc verdict on uddhav vs shinde
supreme court verdict on Uddhav VS Shinde

By

Published : May 11, 2023, 12:44 PM IST

Updated : May 11, 2023, 2:01 PM IST

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఊరటనిచ్చేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన్ను తిరిగి నియమించలేమని వ్యాఖ్యానించింది. ఆయన బలపరీక్షను ఎదుర్కోకుండా స్వచ్ఛందంగా రాజీనామా చేయడమే అందుకు కారణమని వెల్లడించింది. శివసేన పార్టీలో తలెత్తిన సంక్షోభంపై ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం, శిందే వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

అయితే ఆ సంక్షోభ సమయంలో గవర్నర్ వ్యవహరించిన తీరును తప్పుపట్టింది. "ఉద్ధవ్ ఠాక్రే మెజార్టీ కోల్పోయారని నిర్ధరణకు వచ్చేందుకు గవర్నర్ వద్ద తగిన సమాచారం లేనప్పుడు.. సభలో మెజార్టీని నిరూపించుకోమని ప్రభుత్వాన్ని పిలవడం సబబు కాదు. అయితే, ఉద్ధవ్‌ఠాక్రే బలపరీక్షను ఎదుర్కోకుండానే రాజీనామా చేడయంతో తిరిగి ఆయన ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేం. ఠాక్రే రాజీనామా చేయడం వల్ల అప్పటికే అతిపెద్ద పార్టీ అయిన భాజపా మద్దతు ఉన్న ఏక్‌నాథ్‌ శిందే వర్గంతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించడం సమర్థనీయమే" అని వెల్లడించింది.

శిందే, ఆయన వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం తేలకుండానే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించిన నాటి గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ నిర్ణయాన్ని వాదనల్లో భాగంగా ఉద్ధవ్‌ వర్గం ప్రశ్నించింది. ఇప్పుడు ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై తాము అనర్హత వేటు వేయలేమని సుప్రీం వెల్లడించింది. అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటున్న స్పీకర్‌కు.. రెబల్‌ ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు జారీ చేసే అధికారాలు ఉంటాయా లేదా అన్న అంశాన్ని మరింత అధ్యయనం చేయాల్సి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందుకే ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నామని చెప్పింది.

ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఏర్పడిందని సుప్రీంకోర్టు నిర్ణయం చెబుతోందని ఉద్ధవ్‌ వర్గం శివసేన నేత సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు. ఇది తమకు నైతిక విజయమని అన్నారు. ఉద్దవ్​ ఠాక్రే వర్గానికి చెందిన నేత అనిల్​ పరబ్​.. సుప్రీంకోర్టులో జరిగిన పరిణామాలపై మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టులో తీర్పు ఉద్ధవ్ ఠాక్రేకు అనుకూలంగా ఉందని.. శిందే వర్గం ఎమ్మెల్యేలు అనర్హతకు గురవుతారని అన్నారు.

అయితే ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం మార్చి 16న తీర్పును రిజర్వ్ చేసింది. దాదాపు 9 రోజుల పాటు సాగిన ఈ కేసు విచారణలో ఉద్ధవ్ ఠాక్రే వర్గం తరఫున కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ శిందే వర్గం తరఫున హరీశ్ సాల్వే, ఎన్‌కే కౌల్, మహేశ్ జెఠ్మలానీ వాదనలు వినిపించారు.
2022 జూన్‌లో శివసేనకు చెందిన మొత్తం 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది.. తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందేకు మద్దతివ్వడం వల్ల ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలోని మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో సీఎంగా శిందే బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 20న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, వారికి నేతృత్వం వహించిన ఏక్‌నాథ్‌ శిందే అనర్హత అంశాన్ని సత్వరమే తేల్చాలని ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టుకు ఆశ్రయించింది.

రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిరక్షణకు ఇదొక్కటే మార్గమని పేర్కొంది. తిరుగుబాటు నేత, ఆయన వర్గ ఎమ్మెల్యేల అనర్హత ప్రక్రియ ఉపసభాపతి వద్ద పెండింగ్‌లో ఉండగానే శిందేతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించిన అప్పటి గవర్నర్‌ భగత్ సింగ్ కోశ్యారీ నిర్ణయాన్ని కూడా ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం ప్రశ్నించింది. ఠాక్రే వర్గం తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు. అప్పటి మహారాష్ట్ర గవర్నర్‌ భగత్ సింగ్ కోశ్యారీ తన రాజ్యాంగ పరిధిని అతిక్రమించి వ్యవహరించారని ఆరోపించారు. మరోవైపు.. ఫిరాయింపు ఆరోపణలతో రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్​ ప్రకారం తిరుగుబాటుదారులపై అప్పటి డిప్యూటీ స్పీకర్ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ ఏక్‌నాథ్ శిందే వర్గం సుప్రీంను ఆశ్రయించింది.

Last Updated : May 11, 2023, 2:01 PM IST

ABOUT THE AUTHOR

...view details