Supreme Court land allotment: నగరాల పరిధిలో రాజకీయ నాయకులు, జడ్జీలు, ఉన్నతాధికారులు తదితరులకు ఇళ్ల స్థలాలను ప్రభుత్వాలు విచక్షణాధికారం ప్రకారం కేటాయించడాన్ని నిలువరించాలని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు సూచించారు. ఇందుకోసం ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిందేనని అభిప్రాయపడ్డారు. భారత పౌరులై ఉండి, ఆయా నగరాల పరిధిలో జన్మించిన లేదా నివసిస్తున్న వారికి మాత్రమే విచక్షణాధికార కోటా కింద స్థలాలను ఇవ్వాలని పేర్కొన్నారు.
Supreme Court news
ఎమ్మెల్యేలు, ఎంపీలు; ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్ అధికారులు, జడ్జీలు, పాత్రికేయులు తదితరులు సభ్యులుగా ఉన్న హౌసింగ్ సొసైటీలకు భూముల కేటాయింపులో దేశవ్యాప్తంగా ఏకరూప విధానం రూపొందించేందుకు మార్గదర్శకాలను ప్రతిపాదించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అటార్నీ జనరల్ ఈ సూచనలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ హిమాకోహ్లిల ధర్మాసనం ఈ నెల 8న అటార్నీ జనరల్‌కు ఈ ఆదేశాలు ఇచ్చింది.
"శాసనసభలు చేసే చట్టం ప్రకారమే భూముల కేటాయింపులు ఉండాలి. కార్యనిర్వాహక వ్యవస్థ రూపొందించే విధానాలు/మార్గదర్శకాల ప్రకారం ఆ కేటాయింపులు ఉండొద్దు. స్థలాలు పొందటానికి ఆయా కేటగిరీలకు చెందిన వ్యక్తులకు ఉండాల్సిన అర్హతలను చట్టంలో విస్పష్టంగా పేర్కొనాలి. అధికారుల జోక్యానికి అవకాశం లేనివిధంగా ఆ నిబంధనలు ఉండాలి. నోటిఫికేషన్ల రూపంలో అదనపు కేటగిరీలను జోడించడానికి వీలుకల్పించరాదు" అని వేణుగోపాల్ సుప్రీంకు తెలిపారు. అయితే, నిరుపేదలకు విచక్షణాధికారం కింద ప్రభుత్వాలు నివాస స్థలాలను కేటాయించే విధానాన్ని కొనసాగించాలన్నారు. మిగిలిన అన్ని కేటగిరీల వారికీ స్థలాలను కేటాయించాల్సి వస్తే మార్కెట్ విలువను వసూలు చేయాల్సిందేనని చెప్పారు. నిర్మించి ఇచ్చే ఇళ్ల విషయంలో ప్రభుత్వాలు వాస్తవిక ఖర్చును అంచనా వేసి ధరను నిర్ణయించాలని తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ హౌసింగ్ సొసైటీలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూములను కేటాయిస్తూ జీవోలు జారీ చేయగా హైకోర్టు వాటిని 2010లో కొట్టివేసింది. దీనిని సవాల్ చేస్తూ అప్పటి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఆ కేసులో అప్పీలుదారుగా కొనసాగుతోంది.