తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Supreme Court: "వివేకా హత్య కుట్రలో సునీత, ఆమె భర్త పాత్రపై సాక్ష్యాల్లేవు" - viveka murder case

CBI Remand Report on Sunitha: వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, ఆయన సోదరుడు శివప్రకాశ్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని సీబీఐ కోర్టులో దాఖలు చేసిన కౌంటర్‌లోని అంశాలను సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో పొందుపరిచింది. వీరి ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని తెలిపింది. ఇటీవల వైఎస్‌ భాస్కరరెడ్డి అరెస్ట్‌ సమయంలో సీబీఐ సమర్పించిన రిమాండ్‌ నివేదికలోని అంశాలనూ సుప్రీంకోర్టు ప్రస్తావించింది.

CBI Remand Report on Sunitha
CBI Remand Report on Sunitha

By

Published : Apr 25, 2023, 7:39 AM IST

" వివేకా హత్య కుట్రలో సునీత, ఆమె భర్త పాత్రపై సాక్ష్యాల్లేవు"

CBI Remand Report on Sunitha: అవినాష్‌రెడ్డి సన్నిహితుడు శివశంకర్‌రెడ్డి వివేకా హత్య, తదనంతరం సాక్ష్యాల చెరిపివేత కుట్రలో పాలుపంచుకున్నట్లు దర్యాప్తులో తేలిందని సీబీఐ రిమాండ్ నివేదికలో పొందుపరిచింది. సాక్ష్యాల చెరిపివేతలోఎర్రగంగిరెడ్డి క్రియాశీలకంగా పాల్గొనడంతోపాటు, సాక్షి అయిన వాచ్‌మన్‌ రంగన్నను బెదిరించినట్లు తేలిందని తెలిపింది. అందువల్ల 2022 జనవరి 31న దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌లో డి.శివశంకర్‌రెడ్డి, ఎర్రగంగిరెడ్డి పేర్లు చేర్చారు.

వైఎస్‌ అవినాష్‌రెడ్డి పాత్ర గురించి దర్యాప్తు జరుపుతున్నప్పుడు ఇతరుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ హత్య కేసులో ఆయన పాత్ర గురించి సుప్రీంకోర్టుకు సీల్డ్‌ కవర్‌లో అందించామని సీబీఐ తెలిపింది.హత్య, సాక్ష్యాధారాలను చెరిపేయడం విస్తృత కుట్రలో భాగమని దీనివల్ల లబ్ధి పొందింది అవినాష్‌రెడ్డేనని సీబీఐ తెలిపింది.ఎర్రగంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, షేక్‌ దస్తగిరి కలిసి వివేకాను హత్య చేయగా...సాక్ష్యాలను అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, శివశంకర్‌రెడ్డి, ఎర్రగంగిరెడ్డిల సమక్షంలో వారి ఆదేశాల మేరకు ధ్వంసం చేశారని తెలిపింది.

ఇందుకు సంబంధించి పలువురు సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు ఉన్నాయి. కాబట్టి ఈ హత్య వెనుక సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి ఉన్నారన్న ఆరోపణలు పూర్తి నిరాధారమైనవరి సీబీఐ స్పష్టం చేసింది. వైఎస్‌ వివేకానందరెడ్డి షేక్‌ షమీమ్‌ అనే మహిళను 2010లో వివాహం చేసుకొని ఆమెతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. దీని పట్ల శివప్రకాశ్‌రెడ్డి సంతోషంగా లేరు. అయినప్పటికీ ఈ హత్య కుట్ర వెనుక సునీత, రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డిల ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి సాక్ష్యాధారాలూ లభించలేదని సీబీఐ రిమాండ్ నివేదికలో పొందుపరిచింది.

2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు వెన్నుపోటు పొడిచారని వివేకానందరెడ్డి వైఎస్‌ భాస్కరరెడ్డి, శివశంకర్‌రెడ్డిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వివేకా హత్యకు భాస్కరరెడ్డి, శివశంకర్‌రెడ్డి, ఇతర సన్నిహితులు కుట్ర పన్నారని సీబీఐ రిమాండ్ నివేదికలో వెల్లడించింది. హత్యకు నెల రోజుల ముందు నిందితులకు భారీ మొత్తం డబ్బు ఆశ చూపారు. 40 కోట్లు ఇస్తానని శివశంకర్‌రెడ్డి వారి తరఫున హామీ ఇచ్చారు. అందులో సునీల్‌ యాదవ్‌ ద్వారా షేక్‌ దస్తగిరికి ముందస్తుగా కోటి ముట్టజెప్పారు.

వివేకాను హత్య చేసిన అనంతరం నిందితులెవ్వరూ భయపడొద్దని ఎర్రగంగిరెడ్డి వారికి అభయమిచ్చారు. తాను భాస్కరరెడ్డి, ఇతరులతో మాట్లాడానని అంతా వారు చూసుకుంటారని, త్వరలో డబ్బు వస్తుందని చెప్పినట్లు అప్రూవర్‌ దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు. ఆ తర్వాత గుండెపోటు కథ, సాక్ష్యాల ధ్వంసం మొదలుపెట్టినట్లు సీబీఐ రిమాండ్‌ రిపోర్ట్‌లో పొందుపరించింది.

సాక్ష్యాలను చెరిపేయడానికి 2019 మార్చి 15న ఉదయం 5.20 గంటలకు ఉదయ్‌కుమార్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, ఇతరులు.. వైఎస్‌ భాస్కరరెడ్డి, అవినాష్‌రెడ్డిల ఇంట్లో సిద్ధంగా ఉన్నారని.. ఉదయం 6.26 గంటలకు శివప్రకాశ్‌రెడ్డి అవినాష్‌రెడ్డికి ఫోన్‌ చేసి వివేకా మరణం గురించి చెప్పిన వెంటనే ఆయన శివశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఈసీ సురేంద్రరెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, రాఘవరెడ్డి, రమణారెడ్డిలను వెంటబెట్టుకుని మూడు నాలుగు వాహనాల్లో వివేకా ఇంటికి వెళ్లారు.

ఈ విషయం ఉదయ్‌కుమార్‌రెడ్డి మొబైల్‌ ఫోన్‌ గూగుల్‌ టేకౌట్‌ ద్వారా బయటపడింది. ఉదయ్‌కుమార్‌రెడ్డి 6.25 గంటలకు భాస్కరరెడ్డి ఇంట్లో ఉన్నారు. 6.27కల్లా ఆయన మొబైల్‌ వివేకానందరెడ్డి ఇంటి బయట ఉన్నట్లు తేలింది. 6.29 నుంచి 6.31 మధ్య ఆయన వివేకా ఇంట్లో ఉన్నారని సీబీఐ తెలిపింది.

అవినాష్‌రెడ్డి, ఇతరులు వివేకానందరెడ్డి ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత బెడ్‌రూంలో రక్తం, బాత్‌రూమ్‌లో తలపై అత్యంత భయంకరమైన గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన మృతదేహాన్ని చూశారు. వెంటనే అవినాష్‌రెడ్డి తన పీఏ రాఘవరెడ్డి ఫోన్‌ ద్వారా సీఐ శంకరయ్యకు కాల్‌ చేసి వివేకానందరెడ్డి గుండెపోటు, తీవ్ర రక్తపు వాంతులతో చనిపోయాడని చెప్పారు. కుట్రపూరితంగా హత్యకు గురైన వ్యక్తి సాధారణంగా చనిపోయాడని కట్టుకథ అల్లడానికి ప్రయత్నించినట్లు దీనిద్వారా తెలుస్తోందని సీబీఐ రిమాండ్‌ రిపోర్టులో పేర్కొంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details