వలస కార్మికుల రిజిస్ట్రేషన్ పై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పథకాలు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ లేక లబ్ధిదారులకు అవి అందడం లేదని పేర్కొంది. గతేడాది రిజిస్ట్రేషన్ జరపాలని ఆదేశాలు ఇచ్చినా.. ప్రక్రియ నత్తనడకన జరుగుతోందని వ్యాఖ్యానించింది. వలస కూలీల సమస్యలపై సుమోటో కేసుపై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
ఆత్మనిర్భర్ భారత్, జాతీయ ఆహార భద్రత చట్టం వలస కార్మికులకు వర్తింపుపై సుప్రీంకోర్టు ఆరా తీసింది. అన్ని రాష్ట్రాల్లోని వలస కార్మికులు ఆత్మనిర్భర్ భారత్ ప్రయోజనాలు పొందుతున్నారో లేదో తెలపాలని ధర్మాసనం ప్రభుత్వాలను ఆదేశించింది. మహమ్మారి సంక్షోభంలో కార్మికులకు ఆహారం, రవాణా వంటి సదుపాయలు కల్పించాలని పేర్కొంది. సంఘటిత, అసంఘటిత కార్మికులందరి వివరాలు నమోదు చేయాలని పేర్కొంది. సరైన గుర్తింపు, నమోదు ఉంటేనే వలసకార్మికులకు లబ్ధి చేకూరుతుందని జస్టిస్ ఎంఆర్ షా స్పష్టం చేశారు.