తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణలో ఆలస్యం ఎందుకు? - సీబీఐకి సుప్రీంకోర్టు సూటిప్రశ్న - MP Raghurama raju

Jagan illegal assets case in the Supreme Court : జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ ఎందుకు ఆలస్యమవుతుందని సీబీఐ అధికారులను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. రఘురామ రాజుపై అనర్హత పిటిషన్‌ దాఖలు చేసినందునే పిటిషన్లు దాఖలు చేశారని జగన్​ తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి చెప్పగా.. తాము రాజకీయ వ్యవహారాలను పట్టించుకోవడం లేదని, కేవలం న్యాయపరమైన అంశాలనే పరిశీలిస్తున్నట్లు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా స్పష్టం చేశారు.

jagan_cbi_case_rrr
jagan_cbi_case_rrr

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2024, 1:56 PM IST

Jagan illegal assets case in the Supreme Court : జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యానికి కారణమేంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆలస్యానికి తాము బాధ్యులం కాదని సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్‌ తుషార్‌ మెహతా చెప్పగా ఇంకెవరు బాధ్యత వహిస్తారని సుప్రీం ధర్మాసనం నిలదీసింది. కింది కోర్టులో వాయిదాలతో సీబీఐకి సంబంధం లేకపోతే ఎవరికి ఉంటుందని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ప్రశ్నలు సంధించారు. ప్రజాప్రతినిధులపై దాఖలైన పిటిషన్లను త్వరితగతిన విచారించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఈ సందర్భంగా జగన్‌ తరపు న్యాయవాదులు ప్రస్తావించారు. అందువల్ల ఈ పిటిషన్‌పై విచారణ ముగించాలని కోరగా ముగించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

హైకోర్టు సుమోటోగా ఆదేశాలు ఇచ్చినందున 3 నెలల గడువిచ్చి, ఆ తర్వాత పరిశీలించాలని జగన్‌ న్యాయవాదులు విన్నవించారు. సమయం ఇచ్చి ఉపయోగం ఏంటన్న ధర్మాసనం దీనివల్ల ఎలాంటి ఫలితం లేదని వ్యాఖ్యానించింది. ఓ కేసు విచారణ ఇన్నిసార్లు వాయిదా పడటం, ఇంత కాలయాపన జరగడం ఏంటని మరోసారి ప్రశ్నించింది. రాజకీయ దృక్పథంతో రఘురామరాజు పిటిషన్‌ వేశారని జగన్‌ న్యాయవాది నిరంజన్‌ రెడ్డి సుప్రీంకోర్టుకు తెలిపారు. వైకాపా చర్యలు తీసుకోవడంతో మూడేళ్లుగా పార్టీ కార్యకలాపాలకు విరుద్ధంగా ఆయన వ్యవహరిస్తున్నట్లు వివరించారు. రఘురామరాజుపై అనర్హత పిటిషన్‌ వేయడంతో అందుకు ప్రతిగా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారని పేర్కొన్నారు.

అయితే రాజకీయ వ్యవహారాలను తాము పరిశీలించడం లేదన్న సుప్రీంకోర్టు... కేవలం న్యాయపరమైన అంశాలనే చూస్తున్నట్లు స్పష్టంచేసింది. విచారణ ఎందుకు ఆలస్యం అవుతుందన్నదే ప్రధానమైన అంశమని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ఉద్ఘాటించారు. ఇంతకాలం నుంచి ఒక్క డిశ్చార్జ్‌ పిటిషన్‌ అయినా పరిష్కరించారా అని ధర్మాసనం నిలదీసింది. పలుకుబడి ఉన్న వ్యక్తులు కేసులు త్వరితగతిన విచారణ పూర్తి చేయాలని గత ఏడాది డిసెంబర్‌ 15న తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినందున ఏం జరుగుతుందో చూద్దామని అభిప్రాయపడింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ తొలి అర్ధభాగంలో చేపట్టనున్నట్లు ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details