తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆదేశాలిచ్చినా కూల్చివేతలు ఆపరా?: సుప్రీం - సుప్రీంకోర్టు

Jahangirpuri News: జహంగీర్​పురిలో అక్రమ నిర్మాణల కూల్చివేతలో యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తమ ఆదేశాలను మేయర్‌కు తెలియజేసిన తర్వాత కూడా.. కూల్చివేతలు జరగడాన్ని తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. రెండు వారాల తర్వాత ఈ పిటిషన్​ను విచారిస్తామని చెప్పింది.

Jahangirpuri News
Jahangirpuri News

By

Published : Apr 21, 2022, 1:07 PM IST

Updated : Apr 21, 2022, 1:56 PM IST

Jahangirpuri demolition: దిల్లీలోని జహంగీర్‌పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సంబంధించి యథాతథ స్థితిని సుప్రీంకోర్టు పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జమైత్ ఉలామా ఇ హింద్ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ ఎల్‌. నాగేశ్వరరావు, జస్టిస్‌ బీఆర్ గవాయ్‌తో కూడిన ధర్మాసనం ఈ విషయంపై స్పందన తెలపాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. మళ్లీ రెండు వారాల తర్వాత ఈ పిటిషన్ విచారిస్తామని తెలిపింది. తమ ఆదేశాలను మేయర్‌కు తెలియజేసిన తర్వాత కూడా.. కూల్చివేతలకు కొనసాగించడాన్ని తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.

వాదోపవాదనలు: జమైత్ ఉలామా హింద్ తరఫున దుశ్యంత్ దవే కోర్టులో వాదనలు వినిపించారు. ఈ విషయం రాజ్యాంగ, జాతీయ ప్రాముఖ్యంపై విస్తృత ప్రశ్నలను లేవనెత్తుతోందని కోర్టుకు తెలిపారు. ఓ ప్రాంతానికి సంబంధించి విషయంతో జాతీయ ప్రాముఖ్యానికి సంబంధమేంటని ధర్మాసనం దుశ్యంత్​ను ప్రశ్నించింది. అందుకు ఆయన బదులిస్తూ.. ఒక్క జహంగీర్​పుర్​లోనే కాదు దేశంలో అల్లర్లు జరిగిన చాలా ప్రాంతాల్లో బుల్​డోజర్లతో కూల్చివేతలు జరుగుతున్నాయని చెప్పారు. రాష్ట్రప్రభుత్వాలు ఫేక్​ ఎన్​కౌంటర్ల కోసం ఉపయోగించే విధానాన్ని ఇప్పుడు బుల్​డోజర్లకు ఉపయోగిస్తున్నాయని పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలు జరిగిన ధనవంతుల ఆస్తులను వదిలిపెట్టి పేదవారి ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నారని చెప్పారు.

కాంగ్రెస్ బృందం అడ్డగింత: జహంగీర్​పురిలో కూల్చివేతల వల్ల ప్రభావితమైన కుటుంబాలను సందర్శించేందుకు సీనియర్ నేత అజయ్​ మాకెన్​ నేతృత్వంలోని కాంగ్రెస్​ పార్టీ ప్రతినిధుల బృందం అక్కడకు వెళ్లింది. బాధితులను కలిసి దీన్ని మతపరమైన కోణంలో చూడొద్దని చెప్పేందుకు తాము వెళ్లినట్లు మాకెన్ తెలిపారు. ఇది పేదలు, వారి జీవనోపాధిపై భాజపా చేస్తున్న దాడి అని ధ్వజమెత్తారు. ఎలాంటి నోటీసులు లేకుండా చట్టవిరుద్ధంగా నిర్మాణాలను కూల్చుతున్నారని ఆరోపించారు. అయితే కాంగ్రెస్​ నేతల బృందం జహంగీర్​పురి వెళ్లినప్పటికీ.. కూల్చివేత జరిగిన ప్రదేశానికి వారిని చేరుకోకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరును ఆ పార్టీ నేతలు తప్పుబట్టారు.

కాంగ్రెస్ బృందం
కాంగ్రెస్ బృందం

బుధవారం సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా కూల్చివేత కొనసాగించడం దారుణమని కాంగ్రెస్​ మరో నేత, కేంద్ర మాజీ మంత్రి శక్తిసిన్హా​ గోహిల్ మండిపడ్డారు. కేంద్రం వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే.. భాజపా ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. 144 సెక్షన్​ అమల్లో ఉన్న ప్రాంతంలోకి బుల్​డోజర్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఉత్తర దిల్లీ మేయర్ నిర్ణయాలు ఏకపక్షంగా ఉన్నాయని విమర్శించారు. బాధితులను కలిసిన తర్వాత ఓ నివేదికను రూపొందించి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అందజేస్తామని ఆ పార్టీ నేతలు చెప్పారు.

జహంగీర్​పురిలో ఈనెల 16న హునుమాన్​ శోభాయాత్ర నిర్వహిస్తుండగా హింస చెలరేగింది. అల్లరి మూకలు రాళ్లురువ్వడం వల్ల ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో పోలీసులు సహా పులువురు గాయపడ్డారు. ఆ మరునాటి నుంచి ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించి, పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. అయితే బుధవారం అనూహ్యంగా ఆ ప్రాంతంలోకి బుల్​డోజర్లు వచ్చాయి. అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకే చర్యలు తీసుకున్నట్లు ఉత్తర దిల్లీ మేయర్ చెప్పారు. అయితే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని కూల్చివేతలను ఆరోజే ఆపింది. యథాస్థితినే కొనసాగించాలని గురువారం మరోసారి ఆదేశించింది. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే నడుచుకుంటామని ఉత్తర దిల్లీ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకే ఎలాంటి చర్యలైనా తీసుకుంటామన్నారు.

ఇదీ చదవండి:సోషల్​ మీడియాలో స్నేహం.. ఆ వీడియోలతో బెదిరించి అత్యాచారం!

Last Updated : Apr 21, 2022, 1:56 PM IST

ABOUT THE AUTHOR

...view details