PM Modis security breach: జనవరి 5న ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనకు సంబంధించిన ప్రయాణ వివరాలు, ఏర్పాట్ల సమాచారాన్ని వెంటనే భద్రపరచాలని పంజాబ్-హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది సుప్రీం కోర్టు. మోదీ పంజాబ్ పర్యటనలో తలెత్తిన భద్రతా లోపంపై.. దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది.
భద్రతా లోపాలపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన సీనియర్ అడ్వకేట్ మనిందర్ సింగ్ వాదనలు వినిపించారు.
ప్రధాని పర్యటనలో భద్రతా లోపం అనేది కేవలం శాంతిభద్రతల అంశం కాదని, అది స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) చట్టం పరిధిలోకి వస్తుందని కోర్టుకు తెలిపారు మనిందర్ సింగ్. ఎస్పీజీ సమన్వయంతో కేంద్ర, రాష్ట్ర, ఇతర స్థానిక అధికారులు విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రధాని రక్షణ జాతీయ భద్రత అంశమని, పార్లమెంటరీ పరిధిలోకి వస్తుందని తెలిపారు. ఈ సంఘటనపై ఉన్నతస్థాయి అధికారులతో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్రానికి ప్రత్యేకమైన అధికారాలేవి లేవన్నారు సింగ్. రాష్ట్రం ఏర్పాటు చేసిన కమిటీ ఛైర్మన్ వృత్తిపరమైన స్కాముల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు గుర్తు చేశారు.
అత్యంత అరుదైన ఘటన..
ఈ సందర్భంగా కేంద్రం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ప్రధాని పర్యటనలో భద్రతా లోపం సీమాంతర ఉగ్రవాదానికి సంబంధించినదని వివరించారు. అత్యంత అరుదైన సంఘటనగా అభివర్ణించారు మెహతా. 'అంతర్జాతీయంగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్న అరుదైన సమస్యలలో ఒకదానిని గుర్తించినందుకు నేను కృతజ్ఞుడను' అని కోర్టుకు తెలిపారు. ఈ అంశం ఎవరో ఒకరికి వదిలివేయాల్సినది కాదని తెలిపారు. భద్రతాలోపంపై విచారణకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కూడా సహకరిస్తుందని తుషార్ మెహతా వివరించారు.