సర్వోన్నత న్యాయస్థానంలో గురువారం ఇద్దరు మహిళా న్యాయమూర్తులతో కూడిన ఓ బెంచ్‌ను సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఏర్పాటు చేశారు. అత్యున్నత న్యాయస్థానంలోని కోర్ట్ నంబర్ 11లో ఉన్న ఈ బెంచ్‌లోని న్యాయమూర్తులు జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ బేల ఎం త్రివేది వివాహ వివాదాలతో పాటు బెయిల్‌కు సంబంధించిన బదిలీ పిటిషన్లను విచారించనున్నారు.
మహిళా న్యాయమూర్తులతో ప్రత్యేక బెంచ్.. సుప్రీంకోర్టు చరిత్రలో మూడోసారి ఏర్పాటు - సుప్రీం కోర్టు మహిళ న్యాయమూర్తులు
సుప్రీంకోర్టులో ఇద్దరు మహిళా న్యాయమూర్తులతో కూడిన ఓ ప్రత్యేక ధర్మాసనాన్ని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఏర్పాటు చేశారు. ఇలాంటి బెంచ్‌ను ఏర్పాటు చేయడం సుప్రీం కోర్టు చరిత్రలో ఇది మూడో సారి.
2013లో తొలిసారిగా మహిళా ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఆ బెంచ్‌లో జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా, జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ ఉండేవారు. తర్వాత 2018లో జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీతో కూడిన మరో బెంచ్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఏర్పడ్డది మూడో బెంచ్. ప్రస్తుతం ఈ బెంచ్ ముందు 32 పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో వివాహ సంబంధిత వివాదాలపై 10 బదిలీ పిటిషన్‌లతో పాటు 10 బెయిల్ పిటిషన్లు ఉన్నాయి.
సుప్రీంకోర్టులో ప్రస్తుతం ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. వారు.. జస్టిస్ కోహ్లి, జస్టిస్ బి.వి నాగరత్న, జస్టిస్ త్రివేది. అయితే 2027 సీజేఐ రేసులో మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నాగరత్న నియమితులయ్యే అవకాశముంది. వీరితో పాటు సీజేఐతో కలిపి సుప్రీంకోర్టులో 27 మంది న్యాయమూర్తులు ఉన్నారు.