Bilkis Bano : గుజరాత్ అల్లర్ల వేళ సామూహిక అత్యాచారానికి గురైన బిల్కిస్ బానోకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో దోషుల ముందస్తు విడుదలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో దోషులకు రెమిషన్ పాలసీని అమలు చేసేందుకు అనుకూలంగా గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
సుప్రీంకోర్టులో బిల్కిస్ బానోకు చుక్కెదురు.. రివ్యూ పిటిషన్ కొట్టివేత - బిల్కిస్ బానో పిటీషన్ కొట్టివేత
గుజరాత్ అల్లర్ల సమయంలో సామూహిక అత్యాచార బాధితురాలు బిల్కిస్ బానోకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. దోషుల విషయమై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని బిల్కిస్ బానో దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది.
2002లో గోద్రా అల్లర్ల సమయంలో 5 నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై అత్యాచారం చేసిన దుండగులు ఆమె కుటుంబంలోని ఏడుగురిని హత్య చేశారు. ఈ కేసులో 2008 జనవరి 21న సీబీఐ ప్రత్యేక కోర్టు 11 మందికి జీవిత ఖైదు విధించింది. 15 ఏళ్ల జైలు శిక్ష తర్వాత తమను విడుదల చేయాలంటూ దోషుల్లో ఒకరు సుప్రీంను ఆశ్రయించగా దాన్ని పరిశీలించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. దీనిపై కమిటీని ఏర్పాటు చేసిన గుజరాత్ సర్కార్ దోషులకు రెమిషన్ మంజూరు చేయాలని సిఫార్సు చేసింది. వాటిని కోర్టుకు సమర్పించగా.. 1992 నాటి రెమిషన్ పాలసీని అమలు చేసేందుకు గుజరాత్ ప్రభుత్వానికి అనుమతినిచ్చింది.