దేశంలో కరోనా వ్యాక్సిన్ ధరల విధానాన్ని పునఃసమీక్షించాలని.. కేంద్ర ప్రభుత్వానికి సూచించింది సుప్రీంకోర్టు. ప్రస్తుత విధానం వల్ల ప్రజల ఆరోగ్య హక్కుకు విఘాతం కలిగే అవకాశముందని అభిప్రాయపడింది. వ్యాక్సిన్ తయారీదారులు కేంద్రానికి, రాష్ట్రాలకు వేర్వేరు ధరల నిర్ణయించడాన్ని జస్టిస్ డి. వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రస్తావించింది. కరోనాపై పోరులో అత్యవసర వస్తువులు, సేవలు అందుబాటులో ఉంచడానికి సంబంధించిన సుమోటో కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
'కొవిడ్ టీకా ధరల విధానాన్ని పునఃసమీక్షించండి' - 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు గల వారికి వ్యాక్సిన్
దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ ధరల విధానంపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ అంశంపై కేంద్రం మరోసారి సమీక్ష జరపాలని సూచించింది.
సుప్రీంకోర్టు
టీకా ఉచితంగా అందుబాటులో ఉంచాలా? వద్దా? అన్న అంశం.. రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్తోమతపై ఆధారపడి ఉంటుందని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలా అయితే.. అది దేశవ్యాప్తంగా అసమానతలను సృష్టిస్తుందని అభిప్రాయపడింది. బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలకు చెందిన వ్యక్తులకు టీకా కొనుగోలు చేసే సామర్థ్యం ఉండకపోవచ్చని పేర్కొంది. 18 నుంచి 44 ఏళ్ల వయసు కలిగినవారికి వ్యాక్సిన్ అందించేందుకు.. టీకా తయారీదారులతో రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరపవచ్చని సూచించింది.