దిల్లీలో వాయు కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం తాత్కాలిక చర్యలు మాత్రమే చేపట్టిందని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు శాస్త్రీయ పరిశోధన జరిపి గణాంకాల ఆధారంగా మోడల్‌ను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని చెప్పింది. రాష్ట్రాల కార్యదర్శులతో సమావేశం నిర్వహించి అత్యవసర చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. దేశ రాజధానిలో వాయుకాలుష్యంపై బుధవారం మరోసారి విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు నిర్దేశించింది(supreme court delhi pollution).
గాలి దిశ కారణంగా దిల్లీలో కాలుష్యం తగ్గిందని, రానున్న రోజుల్లో ఇంకా తగ్గుతుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే వాటర్ స్ప్రింక్లర్ల ఏర్పాటు వంటి తాత్కాలిక చర్యలు చేపట్టారని జస్టిస్ డీవై చంద్రచూడ్ గుర్తు చేశారు. శాస్త్రీయ ఆధారంగా చర్యలు తీసుకోవాల్సిందని పేర్కొన్నారు(delhi air pollution).
'కాలుష్య తీవ్రత ఈ స్థాయికి చేరుతుందని వాతావరణ మార్పులను ముందే అంచనా వేసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాలుష్య స్థాయి సీజన్‌ను బట్టి మారుతుంది. ఒక ప్రామాణికాన్ని నిర్ణయించాలి. గత ఐదేళ్లలో సీజన్ల వారీగా గణాంకాలను పరిశీలించి విధానాన్ని సిద్ధం చేయాలి. కాలుష్య స్థాయి అన్ని నెలలు ఒకేలా ఉండదు. నవంబర్‌లో ఉన్నట్లు మే నెలలో ఉండదు. దేశ రాజధానిలో ప్రజలు కాలుష్య కోరల్లో చిక్కుకునే పరిస్థితి రాని విధంగా చర్యలు ఉండాలి' అని జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు(supreme court on delhi pollution).