ఓ వ్యక్తి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చుతూనే అరెస్టు నుంచి రక్షణ కల్పించేలా న్యాయస్థానాలు జారీచేసే ఆదేశాలు హేతుబద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు తెలిపింది. అరెస్టు భయంతో బెయిలు కోసం చేసుకొనే దరఖాస్తును తిరస్కరిస్తూనో లేదా ఆమోదిస్తూనో తీసుకొనే నిర్ణయం ఆ వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కులపై నేరుగా ప్రభావం చూపుతుంది కనుక అలాంటి ఆదేశాలిచ్చే సమయంలో దర్యాప్తు సంస్థలు, ఫిర్యాదుదారు, సమాజ ఆందోళనలనూ సమతూకంతో చూడాలని పేర్కొంది.
రెండు వ్యాజ్యాల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తూనే 90 రోజుల పాటు అరెస్టు నుంచి రక్షణ కల్పించడంతో పాటు ట్రయల్ కోర్టులో లొంగిపోయి రెగ్యులర్ బెయిల్‌ను కోరాలంటూ అలహాబాద్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. వీటిని సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేయగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. 'ముందస్తు బెయిల్ కేసుల విచారణలో కోర్టులు ఎదుర్కొనే ప్రత్యేక పరిస్థితులను విస్మరించలేం. నిందితుడికి ముందుస్తు బెయిల్ మంజూరు చేయడం ఇష్టంలేకపోయినా ప్రత్యేక పరిస్థితుల్లో ఆ వ్యక్తి హక్కులను ట్రయల్ కోర్టులో లొంగిపోయే వరకూ కాపాడటం అవసరమనే అభిప్రాయంతో అరెస్టు నుంచి రక్షణ కల్పించాల్సి రావచ్చు' అని 18 పేజీల తీర్పులో సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.