రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకే దేశం- ఒకే రేషన్ పథకాన్ని కచ్చితంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పథకం ద్వారా ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న వలస కార్మికులు లబ్ధి పొందుతారని పేర్కొంది. అసంఘటిత రంగ కార్మికుల జాబితాకు సంబంధించి సాఫ్ట్వేర్ రూపకల్పనలో ఆలస్యం జరగడంపై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎంఆర్ షా ఆధ్వర్యంలోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా.. రేషన్ కార్డు లేని వలస కూలీలు ఏ రకంగా లబ్ధిపొందుతారని ఆందోళన వ్యక్తం చేసింది. వలస కూలీల సమస్యలపై సుమోటో కేసు విచారణ సందర్భంగా శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఈ సందర్భంగా దిల్లీ, బంగాల్, ఛత్తీస్గఢ్, అసోంలు ఈ పథకాన్ని అమలు చేయటం లేదని ధర్మాసనానికి తెలిపారు కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. దిల్లీ తరఫు న్యాయవాది ఈ వాదనలు తొసిపుచ్చారు. దేశ రాజధానిలో అమలు చేస్తున్నట్లు చెప్పారు.