Rahul Gandhi Modi Surname Remark : మోదీ ఇంటి పేరుపై విమర్శల కేసులో గుజరాత్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఈనెల 21న విచారణ చేపట్టేందుకు.. సుప్రీం కోర్టు మంగళవారం అంగీకరించింది. రాహుల్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఆయన తరపున.. సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ప్రస్తావించగా.. ఈ నెల 21(శుక్రవారం) వాదనలు వింటామని తెలిపింది.
జులై 15న దాఖలు చేసిన పిటిషన్ గురించి రాహుల్ గాంధీ తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ సుప్రీం కోర్టులో ప్రస్తావించారు. జులై 21 లేదా జులై 24న విచారించేందుకు పిటిషన్‌ను లిస్ట్ చేయాలని అభ్యర్థించారు. అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న.. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్ర ధర్మాసనం.. జులై 21న విచారణ చేపట్టేందుకు అంగీకరించింది.
Rahul Gandhi Supreme Court : జులై 7న గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించపోతే.. అది వాక్ స్వాతంత్య్రం, భావప్రకటన స్వేచ్ఛ హరించేందుకు దారితీస్తుందని జులై 15న సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్లో రాహుల్ గాంధీ వాదించారు. 'ప్రజాస్వామ్య సంస్థలను నిర్వీర్యం చేయడానికి.. తత్ఫలితంగా ప్రజాస్వామ్యం గొంతు నొక్కడానికి దారితీస్తుంది. అది భారతదేశ రాజకీయ వాతావరణం, భవిష్యత్తుకు తీవ్ర హానికరం. క్రిమినల్ పరువునష్టం కేసులో అనూహ్యంగా రెండేళ్ల శిక్ష విధించారు. ఇది చాలా అరుదైన సంఘటన. శిక్ష సస్పెండ్ చేశారు.. కానీ నేరారోపణపై స్టే విధించలేదు. దీని ఫలితంగా ఎనిమిదేళ్ల సుదీర్ఘ కాలం పాటు ఎన్నికల్లో పోటీచేయకుండా దూరంగా ఉండాలి. అది కూడా ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యంలో.. ఒక పురాతన రాజకీయ పార్టీకి చెందిన మాజీ అధ్యక్షుడు, దేశ ప్రతిపక్ష రాజకీయాలలో ముందుండే వ్యక్తి.' అని రాహుల్ తన పిటిషన్లో పేర్కొన్నారు.
Rahul Defamation Case : మోదీ ఇంటి పేరును ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్‌లోని సూరత్ సెషన్స్ కోర్టు రెండేళ్ల శిక్షను విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో ఈ శిక్షను నిలిపివేయాలంటూ.. గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. రాహుల్ గాంధీకి.. కింది కోర్టు శిక్ష విధించడం సరైనదేనని తెలిపింది. సెషన్సు కోర్టు ఇచ్చిన తీర్పునుసమర్థిస్తూ ఇటీవల రాహుల్ పిటిషన్‌ను కొట్టేసింది. అనంతరం గుజరాత్ హైకోర్టును తీర్పును రాహుల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.