నోయిడాలోని 40 అంతస్తుల ట్విన్ టవర్స్‌ను కూల్చివేయాలంటూ గత నెల ఇచ్చిన తీర్పును సవరించాలని కోరుతూ రియల్‌ఎస్టేట్ కంపెనీ సూపర్‌టెక్ లిమిటెడ్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ట్విన్ టవర్లలో ఒక్కదాన్నే కూల్చేస్తామని, అందుకు న్యాయస్థానం అంగీకరించాలని అభ్యర్థించింది. తీర్పును తాము సవాల్ చేయడం లేదని, అయితే తీర్పును మార్చడం వల్ల కోట్లాది రూపాయలు ఆదా అవుతాయని తెలిపింది.
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని నోయిడాలో సూపర్‌టెక్ లిమిటెడ్ కంపెనీ భారీ ప్రాజెక్టు కింద నిర్మించిన 40 అంతస్తుల ట్విన్ టవర్స్ కూల్చివేయాల్సిందిగా ఆగస్టు 31న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. నిబంధనలను అతిక్రమించి కట్టిన ఈ భవనాలను నిపుణుల పర్యవేక్షణలో మూడు నెలల్లోపు సొంత ఖర్చులతో సూపర్‌టెక్ కంపెనీయే కూల్చాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేగాక, ఈ టవర్స్‌లో ఫ్లాట్లు కొనుక్కొన్న వారికి బుక్ చేసుకున్న సమయం నుంచి 12 శాతం వడ్డీతో ఆ సొమ్ము తిరిగి చెల్లించాలని కోర్టు పేర్కొంది.
అయితే ఈ తీర్పుపై సూపర్‌టెక్ నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ట్విన్ టవర్లలో ఒక్కదాన్నే కూల్చేస్తామని, రెండోదాన్ని అలాగే ఉంచుతామని, అందుకు అనుమతి ఇవ్వాలని కోరింది.