Superstitions in Karnataka: ఆధునిక యుగంలోనూ అంధ విశ్వాసాలు రాజ్యమేలుతున్నాయి. ఊర్లో విపత్తు సంభవిస్తుందేమో అన్న భయంతో నవజాత శిశువును తల్లితో పాటు గ్రామానికి దూరంగా ఉంచే ఆచారం కర్ణాటకలో అమలవుతోంది. రామనగర జిల్లా దేవరదొడ్డి గ్రామంలో తాజాగా ఇటువంటి సంఘటనే జరిగింది. 20 రోజుల వయసు ఉన్న చిన్నారిని, తల్లితో సహా ఊరి బయటకు పంపించారు గ్రామస్థులు. గ్రామంలోని బాలింతలతో పాటు ప్రథమ రజస్వల అయిన వారికీ ఈ నియమం వర్తిస్తుంది.
No entry for pregnant: వీరు మూఢ నమ్మకాలను ఎంత నిక్కచ్చిగా పాటిస్తున్నారో తెలిపేలా గ్రామ శివార్లలో అనేక గుడిసెలు వెలిశాయి. అంతకుముందే కొన్ని గదులను ప్రత్యేకంగా నిర్మించారు గ్రామస్థులు. బాలింతలు, తొలిసారి రుతుక్రమం అయిన బాలికలు ఇక్కడికి వచ్చి నివసిస్తుంటారు. బాలింతలు తమ నవజాత శిశువులతో కలిసి 20 రోజులు ఇక్కడే గడపాల్సి ఉంటుంది. ఇదంతా దేవుడి పేరుతో జరుగుతోంది. గ్రామంలోని శ్రీరంగప్పను కొలుస్తూ ఈ ఆచారం పాటిస్తున్నారు. ఇలా చేయకపోతే ఆయనకు కోపం వస్తుందని, గ్రామానికి మంచిది కాదని చెబుతున్నారు.