తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'చేతబడితో కొడుకు మృతి!'.. భార్యతో కలిసి తండ్రిని హత్య చేసిన వ్యక్తి - బెంగళూరు డబుల్ మర్డర్

చేతబడి చేసి తన కుమారుడిని చంపేశాడని భావించి.. కన్నతండ్రినే హత్య చేశాడు ఓ వ్యక్తి. ఝార్ఖండ్​లోని పలామూలో జరిగిందీ ఘటన. మరోవైపు, బెంగళూరు జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. కాంట్రాక్టర్ ఇంట్లో ఈ హత్యలు జరిగాయి. మాజీ డ్రైవరే ఈ దారుణానికి పాల్పడ్డట్టు పోలీసులు తేల్చారు. అతడితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు.

superstition-murder-in-palamu-
superstition-murder-in-palamu-

By

Published : Dec 20, 2022, 7:43 PM IST

చేతబడి చేశాడన్న అనుమానంతో కన్నతండ్రిని హత్య చేశాడు ఓ వ్యక్తి. తన భార్యను సైతం ఈ నేరంలో భాగం చేశాడు. ఘటన తర్వాత నిందితులు ఇద్దరు ఇంట్లో నుంచి పారిపోయారు. పోలీసులు రంగంలోకి దిగి.. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. ఝార్ఖండ్ పలామూ జిల్లాలోని మాఝియావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

మాఝియావ్​కు చెందిన ధనుకీ(మృతుడు) తాంత్రికుడిగా పనిచేసేవాడు. కొద్దిరోజుల క్రితం తన కొడుకు బలరామ్​తో ధనుకీ గొడవపడ్డాడు. ఈ ఘటన జరిగిన తర్వాత బలరామ్ చిన్న కొడుకు చనిపోయాడు. దీనికి తన తండ్రే కారణమని భావించిన బలరామ్.. అతడిపై కోపం పెంచుకున్నాడు. పూజల కోసం ధనుకీ బయటకు వెళ్లేందుకు సిద్ధమైన సమయంలో.. బలరామ్, అతడి భార్య కలిసి దాడి చేశారు. ధనుకీని తీవ్రంగా కొట్టారు. గాయపడ్డ అతడిని స్థానికులు పలామూలోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ధనుకీ మరణించాడు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు.. తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. నిందితులిద్దరూ పరారీలో ఉన్నారు.

హత్యలు చేసింది వారే..!
బెంగళూరులో కాంట్రాక్టర్ గోపాల్ రెడ్డి ఇంట్లో జరిగిన జంట హత్యల నిందితులను 48 గంటల్లోనే పట్టుకున్నారు కర్ణాటక పోలీసులు. గోపాల్ రెడ్డి వద్ద గతంలో డ్రైవర్​గా పనిచేసిన జగదీశ్ అనే వ్యక్తే ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. కొరమంగళలో డిసెంబర్ 17న ఈ హత్యలు జరిగాయి. గోపాల్ రెడ్డి ఇంటి సెక్యూరిటీ గార్డు దిల్ బహదూర్, ఆయన వద్ద పనిచేసే వ్యక్తి కరియప్పను నిందితులు హత్య చేశారు. అనంతరం రూ.5లక్షల నగదు, వంద గ్రాముల బంగారు ఆభరణాలను చోరీ చేశారు.

రెండున్నర నెలల క్రితం జగదీశ్.. గోపాల్ రెడ్డికి చెందిన ఖరీదైన కారును తీసుకెళ్లి జల్సా చేసుకున్నాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గోపాల్ రెడ్డి.. జగదీశ్​ను, అతడి కుటుంబాన్ని పోలీస్ స్టేషన్​కు పిలిపించి హెచ్చరించాడు. అనంతరం పనిలో నుంచి తీసేసి కొత్త డ్రైవర్​ను పెట్టుకున్నాడు. కొత్త డ్రైవర్​తో పరిచయం పెంచుకున్న జగదీశ్.. గోపాల్ రెడ్డిపై నిఘా పెట్టాడు. ఆయన ఇంట్లో నుంచి బయటకు ఎప్పుడు వెళ్తున్నారనేది ఎప్పటికప్పుడు తెలుసుకున్నాడు. వివాహ వేడుకకు హాజరయ్యేందుకు డిసెంబర్ 15న గోపాల్ రెడ్డి.. తన కుటుంబంతో కలిసి ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురానికి వెళ్తున్నట్లు జగదీశ్​కు తెలిసింది.

నిందితులు

'ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చిందని భావించిన జగదీశ్.. తన స్నేహితుడు కిరణ్, అతడి సోదరుడు అభిషేక్​తో కలిసి గోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లాడు. ఆ ఇంటి గురించి జగదీశ్​కు పూర్తిగా తెలుసు. ముందుగా అతడే గోడ దూకాడు. సీసీ కెమెరాల వైర్లను కట్ చేశాడు. సెక్యూరిటీ గదిలో ఉన్న దిల్ బహదూర్​ను హత్య చేశాడు. అతడి బాడీని సంపులో పడేశాడు. తర్వాత కిరణ్, అభిషేక్​తో కలిసి కాంపౌండ్​లోకి వెళ్లాడు. ఉదయం పని మనిషి కరియప్ప ఇంటి తలుపులు తీసేంతవరకు అక్కడే వేచిచూశారు. డోర్ తీయగానే కరియప్పను చంపేశారు. అనంతరం బంగారం, నగదు తీసుకొని కారులో పరారయ్యారు' అని పోలీసులు తెలిపారు. నిందితులు బైదరహళ్లి, కునిగల్ ప్రాంతాల్లో పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. జగదీశ్​పై మదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్​లోనూ ఓ కేసు ఉందని చెప్పారు. నిందితులు ముగ్గురికీ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

ABOUT THE AUTHOR

...view details