Sunstroke Deaths In Uttar Pradesh : ఉత్తర్ప్రదేశ్లో బలియా జిల్లా ఆస్పత్రిలో గత నాలుగు రోజుల్లో 57 మంది మరణించడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ మరణాలకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఇద్దరు సభ్యులతో కూడిన ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఆదివారం లఖ్నవూ నుంచి బలియా చేరుకుంది. బలియా ప్రభుత్వ ఆస్పత్రిలో దర్యాప్తు జరుపుతోంది.
మరోవైపు.. వడదెబ్బ కారణంగా బలియా జిల్లా ఆస్పత్రిలో గత కొన్ని రోజుల్లో 20 మంది మరణించారని ఆ ఆస్పత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ (సీఎంఎస్) దివాకర్ సింగ్ శుక్రవారం వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రభుత్వం.. అతడిని అజంగఢ్ జిల్లా ఆస్పత్రికి బదిలీ చేసింది. దివాకర్ సింగ్ స్థానంలో కొత్త సీఎంఎస్గా ఎస్కే యాదవ్కు బాధ్యతలు అప్పగించింది.
"రోజుకు బలియా జిల్లా ఆస్పత్రిలో దాదాపు 125 నుంచి 135 మంది రోగులు చికిత్స నిమిత్తం చేరుతున్నారు. అందుకే ఆస్పత్రిలో రద్దీ ఎక్కువగా ఉంది. జూన్ 15న 154 మంది ఆస్పత్రిలో చేరగా.. అందులో పలు అనారోగ్య సమస్యలతో 23 మంది మరణించారు. జూన్ 16న 20 మంది, జూన్ 17న 11 మంది, జూన్ 19న ముగ్గురు అనారోగ్య కారణాలతో మరణించారు. వారందరూ 60 ఏళ్లు దాటిన వారే. వడదెబ్బ వల్ల ఇప్పటివరకు ఇద్దరు మాత్రమే మరణించారు. బలియా జిల్లా ఆస్పత్రిలో గత కొన్ని రోజులుగా సగటున రోజుకు 8 మంది మరణిస్తున్నారు. మరణాల సంఖ్య ఆందోళనకరంగా ఉంది."
--జయంత్ కుమార్, బలియా చీఫ్ మెడికల్ ఆఫీసర్
Ballia Hospital Death : మరోవైపు బలియా ఆస్పత్రిలో రోగుల మరణాల పట్ల సంతాపం వ్యక్తం చేశారు ఉత్తర్ప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్. రోగులు ఏ కారణం వల్ల చనిపోతున్నారో తెలుసుకునేందుకు ప్రభుత్వం ఏకే సింగ్, కేఎన్ తివారీలతో కూడిన కమిటీని వేసిందని ఆయన తెలిపారు. ఈ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత రోగుల మరణాలకు గల కారణాలు తెలుస్తాయని ఆయన అన్నారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. వైద్య సిబ్బంది విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
'బలియా జిల్లా ఆస్పత్రికి చికిత్స కోసం వస్తున్న రోగులు చాలా మంది మొదట ఛాతీ నొప్పి అని చెబుతున్నారు. ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం అని చెబుతున్నారు. వారికి రక్త, మూత్ర పరీక్షలు చేయిస్తున్నాం. కొందరు రోగులు భయంతో ఆస్పత్రిలో చేరుతున్నారు. ఆస్పత్రిలో చేరిన రోగుల్లో కొందరికి ముందు నుంచి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. వడదెబ్బకారణంగా మరణాలు సంభవించాయని కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే వడదెబ్బ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో ఉంది. ఎక్కడా ఇంత స్థాయిలో మరణాలు సంభవించలేదు. ఆస్పత్రిలో చేరిన రెండు నుంచి ఆరు గంటల మధ్యలోపు రోగులు చనిపోతున్నారు. వైద్య పరీక్షల ఫలితాలు వచ్చే లోపే కొందరు మరణిస్తున్నారు. ఇంకా మరణాలకు గల స్పష్టమైన కారణం తెలియలేదు. ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందిస్తాం' అని ప్రభుత్వం నియమించిన కమిటీలో ఒకరైన ఏకే సింగ్ తెలిపారు.