తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Sunitha Lawyer Arguments: "కొత్త థియరీలతో అవినాష్‌ మైండ్‌గేమ్‌.. జగన్‌కు సమాచారంపై సీబీఐ తేల్చాలి"

Sunitha Lawyer on MP Aviansh: వివేకా హత్య గురించి జగన్‌కు ముందే తెలుసని వెల్లడించిన సీబీఐ.. అది ఎలా తెలిసిందన్నది కూడా తేల్చాలని సునీత తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. ఈ కేసులో దర్యాప్తునకు సహకరించకుండా అవినాష్‌ కొత్త కొత్త థియరీలతో మైండ్‌గేమ్‌ ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. సీబీఐ అరెస్ట్ చేయకుండా అనుచరులతో అడ్డుకున్నారని తెలిపారు. దస్తగిరి వాంగ్మూలం తప్ప.. అవినాష్‌రెడ్డికి వ్యతిరేకంగా సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాల్లేవని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. నేడు సీబీఐ వాదనలను తెలంగాణ హైకోర్టు విననుంది.

Sunitha Lawyer on MP Aviansh
Sunitha Lawyer on MP Aviansh

By

Published : May 27, 2023, 8:12 AM IST

"కొత్త థియరీలతో అవినాష్‌ మైండ్‌గేమ్‌.. జగన్‌కు సమాచారంపై సీబీఐ తేల్చాలి"

Sunitha Lawyer on MP Aviansh: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు నడిచాయి. శుక్రవారం ఉదయం 10.50 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు న్యాయస్థానం ఎదుట వాదనలు వినిపించారు. ఈ కేసులో వివేకా కుమార్తె సునీత తరపు వాదనలు వినిపించిన న్యాయవాది.. వివేకా హత్య గురించి సీఎం జగన్‌కు ముందే తెలుసని సీబీఐ వెల్లడించిందని.. అది ఎలా అన్నది కూడా సీబీఐ చెప్పాల్సి ఉందని తెలిపారు.

అవినాష్‌రెడ్డి దర్యాప్తునకు సహకరించకుండా కొత్త థియరీలతో మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారని వెల్లడించారు. ఆయనేమీ నోరులేని వాడు కాదని.. శక్తిమంతమైన రాజకీయ నేత అనే విషయం కర్నూలులో జరిగిన ఘటనలు రుజువు చేస్తున్నాయన్నారు. అవినాష్‌రెడ్డి అరెస్ట్‌ను అడ్డుకోడానికి ఆయన అనుచరులు కార్పెట్‌లతో రోడ్డుకు అడ్డంగా కూర్చుని నిరసన వ్యక్తం చేయడాన్ని బట్టి తెలుసుకోవచ్చన్నారు. హత్యకు సంబంధించి ఇప్పుడు కొత్త థియరీలు చెబుతున్నారని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.

వివేకా హత్యకు వజ్రాల వ్యాపారం, కక్షలు, శృంగారం లాంటి కారణాలున్నాయంటున్నారని తెలిపారు. సీబీఐ నోటీసులిస్తే విచారణకు రాకుండా.. ఇంతకాలం ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించడమేంటన్నారు. ఎప్పుడు అరెస్టు చేయాలన్నది దర్యాప్తు సంస్థ విచక్షణాధికారం పై ఆధారపడి ఉంటుందన్నారు. గతంలో అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై రికార్డులను పరిశీలించిన హైకోర్టు.. కఠిన చర్యలు తీసుకోరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించిందని తెలిపారు.

వివేకా గుండెపోటుతో మృతి చెందినట్లు అవినాష్‌రెడ్డి ఫోన్‌ ద్వారా పోలీసులకు సమాచారం అందించారని వివరించారు. అవినాష్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి తదితరులు సంఘటనా స్థలంలో ఉన్నారని సాక్షులు వెల్లడించారన్నారు. దీనిపైనే సీబీఐ దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. వివేకా హత్య గురించి 2019 మార్చి 15న తెల్లవారు జామున 1.53 గంటలకే అవినాష్‌రెడ్డికి తెలుసన్నారు. ఉదయం 4.11 గంటల ప్రాంతంలో కూడా ఆయన వాట్సప్‌లో ఉన్నారన్నారు. అయితే జమ్మలమడుగు వెళుతూ చిన్నాన్న హత్య గురించి తెలుసుకుని వెనక్కి తిరిగి వచ్చినట్లు మొసలి కన్నీరు కార్చారని.. అందువల్ల ఆయన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు.

అంతకు ముందు అవినాష్‌ తరపున న్యాయవాది సుదీర్ఘంగా ఉదయం నుంచి సాయంత్ర వరకు వాదనలు వినిపించారు. సీబీఐ దర్యాప్తు లోపభూయిష్టంగా ఉందన్నారు. హత్య అనంతరం పోలీసులు, సిట్‌ దర్యాప్తు అంశాలకు చెందిన కేసు డైరీని మూడేళ్లయినా కోర్టుకు సమర్పించలేదన్నారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా కేవలం కౌంటరులోని అంశాల ఆధారంగా అవినాష్‌ నిందితుడని ముద్ర వేస్తున్నారన్నారు. హైకోర్టు ద్వారా అరెస్టు నుంచి లభించిన రక్షణ గత నెల 26న సుప్రీంకోర్టు ఉత్తర్వులతో రద్దయిపోయినా.. ఈనెల 15 వరకు దాదాపు 21 రోజులపాటు అవినాష్‌ను సీబీఐ విచారణకు పిలవలేదన్నారు.

తల్లి అనారోగ్యంతో ఉండగా..ఇప్పుడు హడావుడి ఎందుకు చేస్తున్నారని అవినాష్‌ తరపు న్యాయవాది ప్రశ్నించారు. సాక్ష్యాధారాలను చెరిపేశారన్న ఆరోపణలపై పిటిషనర్‌ తండ్రి భాస్కరరెడ్డిని అరెస్ట్‌ చేశారని.. అవే ఆరోపణలతో అవినాష్‌రెడ్డిని నిందితుడిగా చేస్తున్నారన్నారు. హత్యలో పాల్గొన్న నిందితులందరినీ అరెస్ట్ చేసిన సీబీఐ.. దస్తగిరి ముందస్తు బెయిల్‌ను వ్యతిరేకించలేదన్నారు. సీబీఐ పెంపుడు జంతువు దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం తప్ప.. అవినాష్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. సీబీఐ సాక్షులను బెదిరించినట్లు చెబుతోంది కానీ.. ఎవరిని బెదిరించారో చెప్పడంలేదని అవినాష్‌ తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details