Sunil Kanugolu Karnataka Election : ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుకు కీలక పదవిని కట్టబెట్టింది కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ప్రధాన సలహాదారుడిగా నియమించింది. తక్షణమే ఆయనకు కేబినెట్ హోదాకు లభించే అన్ని సౌకర్యాలను కల్పించాలని ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు సీఎం సిద్ధరామయ్య. తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ను విజయపథంలో నడిపించిన ఐదు ఉచిత హామీలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలయ్యేలా సునీల్.. సలహాలు ఇస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంలో కీలక పాత్ర పోషించిన సునీల్.. ఇకపై పరిపాలనలోనూ తనదైన ముద్రను వేయనున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ అఖండ విజయం సాధించడంలో ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు కీలక పాత్ర పోషించారు. ఎన్నికల ముందు ఉచిత హామీల దగ్గర నుంచి అవి ప్రజల్లోకి చేరే వరకు ఆయన తీవ్రంగా శ్రమించారు. ముఖ్యమంత్రి బొమ్మైపై 40శాతం కమీషన్లు తీసుకొంటున్నట్లు చేసిన ఆరోపణలను అవకాశంగా తీసుకొని 'పే సీఎం' పేరిట ప్రచారంలో ఆయనదే కీలక పాత్ర. అమూల్ వర్సెస్ నందినీ డెయిరీల వ్యహారాన్ని కన్నడిగుల ఆత్మగౌరవంతో ముడిపెట్టి ప్రచారం చేయడంలో సునీల్ బృందం పాత్ర ఉంది. కర్ణాటకలో చివరకు టికెట్ల పంపిణీల్లో సునీల్ బృందం సర్వే సూచనల మేరకే కాంగ్రెస్ అధినాయకత్వం కేటాయింపులు చేసింది. ఇలా బీజేపీ ఎత్తుగడలను చిత్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టారు సునీల్.
ఎవరీ సునీల్ కనుగోలు?
Sunil Kanugolu Wikipedia : సునీల్ కనుగోలు కర్ణాటకలోని బళ్లారిలో జన్మించారు. ఆ తర్వాత చదువు కోసం చెన్నైకు మకాం మార్చారు. అనంతరం అమెరికా వెళ్లి ఎంబీఏ చదివి.. అక్కడే అంతర్జాతీయ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ మెకన్సీ కోసం పనిచేశారు. తర్వాత భారత్‌కు తిరిగి వచ్చిన సునీల్.. గుజరాత్ రాజకీయ వ్యూహాల్లో చురుగ్గా పనిచేశారు. ది అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్‌కు చీఫ్‌గా పనిచేశారు. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ వ్యూహకర్తల బృందంలో సునీల్ కూడా ఒకరు.