Sulabh International Founder Death :సామాజిక ఉద్యమకారుడు, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్(80) కన్నుమూశారు. దేశంలో పెద్ద ఎత్తున పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి కృషి చేసిన ఆయన.. దిల్లీ ఎయిమ్స్‌లో మంగళవారం తుది శ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్ట్‌తో బిందేశ్వర్ ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. 'పంద్రాగస్టు సందర్భంగా మంగళవారం ఉదయం జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఆయన.. కాసేపటికే కుప్పకూలి పడిపోయారు. వెంటనే ఆయన్ను దిల్లీ ఎయిమ్స్‌కు తీసుకెళ్లాం. అప్పటికే ఆయన చనిపోయారని వైద్యులు ప్రకటించారు. మరణానికి కార్డియాక్ అరెస్ట్ కారణమని వెల్లడించారు' అని సంబంధిత వర్గాలు వివరించాయి.
ప్రధాని విచారం
పాఠక్ మృతిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. సామాజిక పురోగతికి, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన విశేషంగా కృషి చేశారని కొనియాడారు. పరిశుభ్రమైన భారతదేశ నిర్మాణమే లక్ష్యంగా పని చేశారని గుర్తు చేసుకున్నారు. "స్వచ్ఛత, పరిశుభ్రత పట్ల ఆయనకు ఉన్న అభిరుచి మా సంభాషణల్లో స్పష్టంగా తెలిసేది. స్వచ్ఛ భారత్ మిషన్‌కు ఆయన విశేష సహకారం అందించారు. ఆయన చేసిన సేవలు ఎంతో మందికి స్ఫూర్తిని ఇస్తాయి. ఆయన కుటుంబానికి, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి" అని మోదీ ట్వీట్ చేశారు.
Bindeshwar Pathak Death :మానవ హక్కుల పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, విద్య ద్వారా సామాజిక సంస్కరణలు తీసుకురావడమే లక్ష్యంగా సులభ్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు పాఠక్. బహిరంగ మలమూత్ర విసర్జనకు వ్యతిరేకంగా పోరాడుతూ.. సులభ్ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా అనేక కమ్యూనిటీ పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి కృషి చేశారు. సులభ్ టాయిలెట్ల వ్యర్థాల ద్వారా బయోగ్యాస్ తయారీ చేసే పద్ధతిని ఆయన కనుగొన్నారు. మొక్కలకు బయో ఎరువులు అందేలా సులభ్ టాయిలెట్లను అనుసంధానిస్తూ డిజైన్‌ను రూపొందించారు. మూడు దశాబ్దాల క్రితం ఆయన రూపొందించిన ఈ డిజైన్‌నే ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికీ ఉపయోగిస్తున్నాయి. ఆయన చేసిన సేవలకు గుర్తుగా.. భారత మూడో అతిపెద్ద పౌర పురస్కారమైన 'పద్మ భూషణ్'తో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను 1990లో సత్కరించింది.