దేశంలో క్రమంగా ప్రాభవం కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ మరో రాష్ట్రంలో పూర్తిస్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల వెలువడిన హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన హస్తం పార్టీ.. ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పరచింది. హిమాచల్ ప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా సుఖ్విందర్ సింగ్ సుఖుతో ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణం చేయించారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన 58 ఏళ్ల సుఖ్విందర్ సింగ్ సుఖు.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు.
సాధారణ బస్సు డ్రైవర్ కుమారుని స్థాయి నుంచి వచ్చిన సుఖు.. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఉపముఖ్యమంత్రిగా ముఖేశ్ అగ్నిహోత్రి ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో హిమాచల్ ప్రదేశ్ లో మొట్టమొదటి ఉపముఖ్యమంత్రిగా నిలిచారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మాట్లాడిన సుఖ్విందర్ సింగ్ సుఖు.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతామని తెలిపారు. మొత్తం 10 హామీలు ఇచ్చామని.. పారదర్శక, నిజాయితీ పాలనను అందిస్తామని పేర్కొన్నారు. తొలి మంత్రివర్గ సమావేశంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు పాత ఫించను విధానాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు.