మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీపై సంచలన ఆరోపణలు చేశాడు. కేజ్రీవాల్ పార్టీకి రెండు విడతలుగా రూ.60 కోట్లు ఇచ్చానని చెప్పాడు. మంగళవారం దిల్లీలోని పటియాలా హౌస్ న్యాయస్థానం నుంచి బయటకు వస్తుండగా.. మీడియాతో ఈ విషయం తెలిపాడు. దిల్లీ సీఎం కేజ్రీవాల్, మంత్రి సత్యేందర్ జైన్పై తాను చేసిన ఆరోపణలన్నీ నిజమేనని పేర్కొన్నాడు.
'కేజ్రీవాల్ పార్టీకి రూ.60 కోట్లు ఇచ్చా.. వారిపై చేసిన ఆరోపణలన్నీ నిజమే' - sukesh chandrasekhar latest news
ఆమ్ ఆద్మీ పార్టీకి రెండు విడతలుగా రూ.60 కోట్లు ఇచ్చానని ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ చెప్పుకొచ్చాడు. తాను గతంలో కేజ్రీవాల్, ఆయన మంత్రులపై చేసిన ఆరోపణలన్నీ నిజమేనని అన్నాడు.
ఇటీవల ఆప్ లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేశాడు సుకేశ్. రూ.500 కోట్ల పార్టీ ఫండ్ సమకూర్చాలని తనపై కేజ్రీవాల్ ఒత్తిడి తెచ్చారని గతంలో ఆరోపించాడు. ఆ పార్టీకి 2016లో రూ.50 కోట్లు ఇచ్చానని చెప్పుకొచ్చాడు. అరెస్టయి దిల్లీ జైలులో ఉన్నప్పుడు.. తనకు రక్షణ కల్పిస్తానంటూ మంత్రి సత్యేంద్రజైన్ తన నుంచి బలవంతంగా రూ.10కోట్లు వసూలు చేశారని ఆరోపించాడు. ఈ మేరకు దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు లేఖలు రాశాడు.
అయితే, ఈ ఆరోపణలు చేసిన తర్వాత జైలులో తనపై ఒత్తిడి పెరిగిపోయిందని రెండు రోజుల క్రితం ఓ లేఖ విడుదల చేశాడు సుకేశ్. ఆప్ సర్కారు, ఆ పార్టీ నేతలు.. జైలు అధికారులను బెదిరిస్తున్నారని అన్నాడు. ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని వారు కోరుతున్నారని చెప్పాడు. దిల్లీ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భాజపా ఒత్తిడితోనే ఇలాంటి ఆరోపణలు చేశానని చెప్పమంటున్నారని అన్నాడు. ఎవరి ఒత్తిడితోనూ తాను ఆరోపణలు చేయలేదని స్పష్టం చేశాడు.