మహారాష్ట్ర 'లేడీ సింగమ్'గా గుర్తింపు పొందిన అటవీ అధికారిణి దీపాలీ చవాన్(28) ఆత్మహత్య చేసుకున్నారు. భారత అటవీ సర్వీస్(ఐఎఫ్‌ఎస్) అధికారి ఒకరు తనను లైంగికంగా తీవ్ర వేధింపులకు గురిచేశాడని, ఆయన చేతిలో తాను చిత్రహింసలకు గురయ్యానంటూ ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన నాలుగు పేజీల లేఖ ప్రకంపనలు సృష్టిస్తోంది. మెల్గాట్ టైగర్ రిజర్వు(ఎంటీఆర్) సమీపంలోని హరిసాల్ గ్రామంలోని తన అధికారిక నివాసం(క్వార్టర్స్)లో గురువారం రాత్రి పొద్దుపోయాక ఆమె సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు.
ధైర్య సాహసాలతో అటవీ మాఫియా ఆటలు కట్టించిన దీపాలీ చవాన్ 'లేడీ సింగమ్'గా పేరు సంపాదించుకున్నారు. ఆమె భర్త రాజేశ్ మొహితే చిఖల్‌ధారలో ట్రెజరీ అధికారి. దీపాలి తల్లి తన సొంతూరైన సతారాకు వెళ్లిన సమయంలో ఆమె ఈ తీవ్ర చర్యకు పాల్పడ్డారు.
లేఖలో ఏముంది..?
"రాత్రి వేళలు పెట్రోలింగ్‌కు రమ్మని చెప్పి వినోద్ నాతో అసభ్యకరంగా ప్రవర్తించేవారు. తన చర్యలను ప్రతిఘటిస్తున్నాని జనం అందరి ముందు నన్ను అవమాన పరిచేవారు. నా జీతాన్ని కూడా నాకు అందనివ్వకుండా ఇబ్బందులకు గురిచేశారు. నేను గర్భవతిగా ఉన్నప్పుడు నేన్ను మా అత్తమామల ఇంటికి వెళ్లడానికి అనుమతి నిరాకరించడమే కాక నన్ను ఎత్తైన ప్రాంతాల్లో విధులకు ఆదేశించారు. దీని వల్ల నాకు గర్భస్రావం అయింది. వినోద్ వైఖరి పట్ల ఎంటీఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్.శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేశాను. కానీ వినోద్పైన ఎలాంటి చర్యలు చేపట్టనని చెప్పారు. అమరావతి ఎంపీ నవనీత్ రాణాకు కూడా ఫిర్యాదు చేశాను."
-ఆత్మహత్య లేఖలో దీపాలీ
ఈ ఏడాది ఫిబ్రవరి మొదట్లో గర్భవతిగా ఉన్న దీపాలీని మూడు రోజుల పాటు పెట్రోలింగ్ నిర్వహించాల్సి ఉందంటూ శివకుమార్ తనతో పాటు బలవంతంగా అడవిలోకి తీసుకెళ్లాడని ఆమె సన్నిహితురాలు ఒకరు తెలిపారు. గర్భిణీ అన్న విషయం తెలిసి కూడా కిలోమీటర్ల దూరం నడిపించాడని, గర్భస్రావం కావడం వల్ల దీపాలీ తీవ్ర మనోవేదనకు గురైందని వివరించారు.
ఇక సెలవు..