NDA Expansion Omprakash Rajbhar : వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతున్న వేళ.. భారతీయ జనతా పార్టీ కూడా ఎన్డీఏను బలోపేతం చేయటంపై దృష్టి సారించింది. పాతమిత్రులను తిరిగి ఎన్డీఏ గూటికి తెచ్చేందుకు కొన్నిరోజుల నుంచి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. తూర్పు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓబీసీల్లో గట్టిపట్టున్న నేతగా గుర్తింపు పొందిన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాశ్ రాజ్‌భర్.. తిరిగి ఎన్డీఏ గూటికి చేరారు. ఈ మేరకు తన కుమారుడు అరవింద్ రాజ్భర్తో కలిసి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసి ఎన్డీఏలో చేరినట్లు ప్రకటించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
'బీజేపీ, ఎస్బీఎస్పీ ఒక్కటయ్యాయి. దేశంలో సామాజిక న్యాయం, భద్రత, సుపరిపాలన, అణగారిన వర్గాలు, దళితులు, మహిళలు, రైతులు, యువత, బలహీన వర్గాల కోసం.. భారతీయ జనతా పార్టీ, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ కలిసి పోరాడతాయి.'
--ఓం ప్రకాశ్ రాజ్‌భర్, ఎస్బీఎస్పీ అధినేత
ఎన్డీఏలోకి తిరిగి వచ్చిన ఓం ప్రకాశ్ రాజ్‌భర్, ఆయన కుమారుడిని అమిత్ షా స్వాగతించారు. 'ఓం ప్రకాశ్ రాజ్‌భర్‌ను దిల్లీలో కలిశాను. ప్రధాని నేతృత్వంలోని ఎన్డీఏలోకి రావాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఎన్డీఏలోకి ఓం ప్రకాశ్‌కు స్వాగతించాను. రాజ్‌భర్ రాకతో ఉత్తర్‌ప్రదేశ్‌లో కూటమి బలం పెరుగుతుంది. పేదలు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం మోదీ నేతృత్వంలో ఎన్డీఏ చేస్తున్న కృషికి మరింత బలం చేకూరుతుంది' అని ట్వీట్ చేశారు.