నేడే ప్రపంచ పిచ్చుకల దినోత్సవం World Sparrow Day: కొన్నేళ్ల క్రితం రైతులకు మంచి స్నేహితులుగా ఉంటూ రైతు పెట్టింది తింటూ ఆనందంగా వారి గుడిసె లోనే జీవనం సాగించేవి పిచ్చుకలు. కిలకిల రాగాలతో ఎగురుతూ, గెంతుతూ కిచకిచమంటూ తిరిగే ఈ చిరు ప్రాణి నేడు ఎక్కడా కనిపించడం లేదు. చాలా పరిమిత సంఖ్యలో అక్కడక్కడా మాత్రమే కనిపిస్తున్నాయి. అవి మనుగుడ సాధించలంటే నేడు మనం వాటిని అరచేతిలో పెట్టుకుని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
"పిచ్చుకలు వ్యవసాయ రంగంలో చేదోడుగా నిలుస్తాయి. వీటి వల్ల పర్యావరణం సమతౌల్యమౌవుతోంది. ఇంటి పరిసర ప్రాంతాలలో గూళ్లు నిర్మించుకుని అవి అటు, ఇటు తిరుగుతూ ఉంటే.. ఎంతో అహ్లదకరంగా ఉంటుంది. ఈ సమయం అవి సంతానాన్ని వృద్ధి చేసుకునే సమయం. అందువల్ల వాటి కోసం బర్డ్ హౌస్లను ఏర్పాటు చేస్తే వాటి సంఖ్యను పెంచటానికి అవకాశం ఉంటుంది."-స్ఫూర్తి శ్రీనివాస్, పిచ్చుకల ప్రేమికుడు
ఒకప్పుడు పిచ్చుకల కోసం మన పూర్వీకులు ఎంతో తపన పడేవారు. వాటికోసం ఇంటి ముంగిట, వరండాలో జొన్న కంకులు, వరికంకులు, సజ్జ కంకులను వేలాడదీసేవారు. ఇలా వేలాడదీసిన కంకుల మీద వాలి పిచ్చుకలు తమ ఆహారాన్ని సంపాదించుకొని, ఇటూ అటూ ఎగురుతూ, తమ కిచకిచలతో ఈ ప్రకృతిని అందమైన ప్రపంచంగా మార్చేవి. రైతులకు వ్యవసాయంలో సహాయపడేవి. పంటలకు హాని చేసే క్రిమికీటకాలను పిచ్చుకలు ఆహారంగా తింటాయి. వ్యవసాయానికి ఎంతో సాయం చేసేవి. పర్యావరణ సమతుల్యాన్ని, జీవవైవిధ్యాన్ని, సమగ్రతను కాపాడేవి. వివిధ రకాల ధాన్యపు గింజలను మన పూర్వీకులు పిచ్చుకల కోసం చల్లేవారు.
మాడ్రనైజేషన్లో మాయమైపోతున్న పిచ్చుకలు : ఆధునికత పెరిగిన తర్వాత సెల్ టవర్ రేడియేషన్, గాలి కాలుష్యం, వల్ల వాటి సంతాన ఉత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. అపార్ట్మెంట్ కల్చర్ పెరగడం వల్ల, నివాసాన్ని కోల్పోతున్నాయి. చివరికి పిచ్చుకల జాతి అంతరించే స్థాయికి చేరుకుంది. ఇవే కాకుండా పంటల ఉత్పత్తిలో రసాయనాలు ఉపయోగించడం, చెట్లను నరికి వేయటం, ఆహార ధాన్యాలలో సైతం అనేక కృత్రిమ రసాయనాలు వాడటం వల్ల పిచ్చుక జాతి అంతరించి పోతుందని పలు పరిశోధనల్లో తేలింది.
పిచ్చుకల జీవన కాలం మూడేళ్ళు. మనం చదివే అనేక కథల్లో, పాటల్లో, సామెతల్లో పిచ్చుకకు ప్రాధాన్యం మనకి కనిపిస్తుంది. మానవులు-పిచ్చుకల మధ్య విడదీయరాని బంధం ఉంది. బతుకు మీద ఆశకు ప్రతి రూపాలుగా పిచ్చుకలు మారిపోయాయి. మగ పిచ్చుకలు చూడాటానికి బొద్దుగా ఉంటే.. ఆడ పిచ్చుకలు మాత్రం సన్నగా ఉంటాయి. గడ్డి పరకలు, పుల్లలతో అందమైన గూళ్లు నిర్మించే మోడ్రన్ ఆర్కిటెక్. త్వరగా అంతరించిపోతున్న పక్షుల జాబితాలో పిచ్చుకలు చేరుతున్నాయి.
పిచ్చుకలు రక్షణ కోసం పిచ్చుకల ఆవశ్యకతను తెలియజేస్తూ అవగాహన కార్యక్రమాలు ప్రభుత్వాలు చేపట్టాలి. పిచ్చుకల కోసం కృత్రిమ నివాసాలు ఏర్పాటు చేయాలి. మన ఇంటి పైన, ఇంటి ముందర గోడలపైన చిన్నచిన్న గిన్నెలలో నీళ్ళు నింపి ఉంచాలి. పిచ్చుకలకు బియ్యం, జొన్నలు, సజ్జలు వంటి ధాన్యపు గింజలను వాటికి అందుబాటులో ఉంచాలి. అంతరించిపోతున్న పిచ్చుకలను మన తరువాత తరానికి అందించాల్సిన ఆవశ్యకతపై నేటి తరానికి అవగాహన కల్పించాలి.
ఇవీ చదవండి :