తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సూది గుచ్చకుండానే షుగర్ టెస్ట్- ఏపీ ఉంగుటూరువాసికి పేటెంట్‌ రైట్స్ ఇచ్చిన కేంద్రం - మధుమేహ పరీక్షల పరికరం

Sugar Sweat Test: వ్యక్తి శరీరంలో షుగర్ స్థాయిని గుర్తించేందుకు తక్కువ ఖర్చుతో కూడుకున్న పరికరాన్ని కనుగొన్నారు ఏలూరు జిల్లాకు చెందిన శాస్త్రవేత్త. చెమటతోనే గ్లూకోజ్​ను నిర్ధరించే ఈ పరికరాన్ని నిశితంగా పరీక్షించిన భారత ప్రభుత్వం పేటెంట్ రైట్స్ ఇస్తూ ధ్రువపత్రం జారీ చేసింది.

Sugar_Sweat_Test
Sugar_Sweat_Test

By ETV Bharat Telugu Team

Published : Jan 2, 2024, 12:05 PM IST

Updated : Jan 2, 2024, 12:12 PM IST

Sugar Sweat Test: ప్రస్తుత పరిస్థితుల్లో మధుమేహ స్థాయిని గుర్తించే పరీక్షలు ఖర్చుతో కూడుకున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థికంగా ఇబ్బందే. చిన్నారుల్లో మధుమేహాన్ని కొలిచేందుకు సూదితో పొడిచి శరీరం నుంచి రక్తం తీస్తున్నప్పుడు నొప్పి భరించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సమస్యకు పరిష్కారంగా ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన వూసా చిరంజీవి శ్రీనివాసరావు గ్లూకోజ్‌ను నిర్ధరించడానికి ఎలక్ట్రోకెమికల్‌ పరికరాన్ని కనుగొన్నారు. రక్తం అవసరం లేకుండా ఈ పరికరంతో చెమటను పరీక్షించి నిమిషంలో మధుమేహాన్ని లెక్కించొచ్చు. భారత ప్రభుత్వం ఈ పరికరాన్ని నిశితంగా పరీక్షించి పేటెంట్‌ హక్కులు ఇస్తూ ఇటీవల ధ్రువపత్రం జారీ చేసింది.

షుగర్ ఉన్నవారు చికెన్, మటన్ తినకూడదా? ఏం తింటే బెటర్​?

నాలుగేళ్ల పాటు శ్రమించి:జీవ రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ చేసిన శ్రీనివాసరావు ప్రస్తుతం ఐఐటీ కాన్పుర్‌లో కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో సైంటిస్ట్​గా పనిచేస్తున్నారు. 18 ఏళ్లలోపు చిన్నారులు టైప్‌-1 మధుమేహం బారిన పడుతున్నారు. ఈ సమస్యతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ నాలుగు సార్లు గ్లూకోజ్‌ పరీక్షలు చేసుకుని ఇన్సులిన్‌ వేసుకోవాలి. క్రమం తప్పితే కోమాలోకి వెళ్లి పోయే అవకాశాలు ఎక్కువ. టైప్‌-2 మధుమేహం బాధితులదీ ఇదే పరిస్థితి.

దీంతో వారి కోసం ఏమైనా చేయాలనే లక్ష్యంతో శ్రీనివాసరావు ఎలక్ట్రోకెమికల్‌ పరికరాన్ని కనుగొన్నారు. ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రోకెమికల్‌, సెన్సర్లను వినియోగించి నాలుగేళ్ల పాటు కష్టపడి ఈ పరికరాన్ని రూపొందించినట్లు శ్రీనివాసరావు తెలిపారు. దీనిని రెండేళ్ల పాటు భారత ప్రభుత్వం(ఇండియన్‌ పేటెంట్‌ అధారిటీ) అన్ని విధాలుగా పరీక్షించి గత నెల 29న పేటెంట్‌ హక్కులు నిర్ధరిస్తూ ధ్రువపత్రం జారీ చేసిందని ఆయన వివరించారు.

కష్టానికి గుర్తింపు దక్కింది:

నిరుపేద కుటుంబంలో పుట్టిన శ్రీనివాసరావు తండ్రి వాచ్​మెన్, తల్లి దుర్గ కూలి పనులకు వెళ్లి ఆయనను చదివించినట్లు తెలిపారు. కనీసం ఇంట్లో కరెంట్ కూడా లేని పరిస్థితిలో చదువుకుంటూనే సెలవు రోజుల్లో రంగులు వేయడానికి, కూలి పనులకు ఆయన వెళ్లేవారని వివరించారు. కాగా చెమటను పరీక్షించి నిమిషంలో మధుమేహాన్ని లెక్కించే ఈ పరికరాన్ని కనుగొన్న ఆయన నాలుగేళ్ల శ్రమకు ఫలితం దక్కిందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

"మాది నిరుపేద కుటుంబం. నాన్న భీమయ్య వాచ్‌మన్‌. అమ్మ దుర్గ కూలి పనులకు వెళ్తూ నన్ను, అక్కను చదివించారు. ఇంట్లో కరెంటు కూడా లేని పరిస్థితి. చదువుకుంటూనే సెలవు రోజుల్లో రంగులు వేయడానికి, కూలి పనులకు వెళ్లా. ప్రభుత్వ విద్యాసంస్థల్లో డిగ్రీ వరకు చదువుకున్నా. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో పీజీ చేశా. నాలుగేళ్ల కష్టానికి గుర్తింపు దక్కింది. ఇప్పటి వరకు ఉన్న పరికరాలతో పోల్చుకుంటే దీనితో చాలా తక్కువ ఖర్చుతో గ్లూకోజ్‌ను నిర్ధరించవచ్చు. వినియోగంలోకి వస్తే పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది" - చిరంజీవి శ్రీనివాసరావు, షుగర్​ స్థాయిని కొలిచే పరికరాన్ని కనుగొన్న శాస్త్రవేత్త

21నిమిషాలపాటు వాకింగ్​, అరగంట యోగా- రోజూ ఇలా చేస్తే షుగర్​ వ్యాధి ఫుల్ కంట్రోల్​!

Last Updated : Jan 2, 2024, 12:12 PM IST

ABOUT THE AUTHOR

...view details