దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య అమాంతంగా పెరిగిపోతుండడాన్ని 'జాతీయ సంక్షోభం'గా పేర్కొన్న సుప్రీంకోర్టు.. తాజా పరిస్థితులను మౌన ప్రేక్షకునిగా చూస్తూ ఉండలేమని స్పష్టం చేసింది. కొవిడ్ కట్టడి కోసం జాతీయ విధాన రూపకల్పన అంశంపై సుమోటోగా విచారణ చేపట్టడాన్ని సమర్థించుకుంది. ఈ చర్యను వివిధ హైకోర్టుల్లో విచారణలో ఉన్న కరోనా సంబంధిత కేసులను గుప్పిట్లోకి తీసుకోవడంగా భావించరాదని జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్.రవీంద్రభట్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
హైకోర్టులే నిర్ణయాలు
కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై ధర్మాసనం మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ విధానంలో విచారణ జరిపింది. వివిధ హైకోర్టుల్లో కరోనా సంబంధిత కేసులు విచారణలో ఉన్న సమయంలో అదే అంశంపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ చేపట్టడాన్ని గత గురువారం కొందరు న్యాయవాదులు విమర్శించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తమతమ ప్రాదేశిక పరిధుల్లోని అంశాలపై హైకోర్టులే నిర్ణయాలు తీసుకుంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది.
" ప్రాదేశిక పరిమితుల వల్ల హైకోర్టులకు ఇబ్బందులు ఏర్పడితే సహాయం చేస్తాం. మేం అంతరాన్ని పూరించే పాత్రను నిర్వహించదలిచాం. మాజోక్యాన్ని సరైన దృష్టితో అర్థంచేసుకోవాలి. ప్రాంతీయ పరిధులకు మించిన అంశాలూ కొన్ని ఉంటాయి. అప్పుడు సర్వోన్నత న్యాయస్థానం జోక్యం అవసరం ఏర్పడుతుంది."
-- సుప్రీంకోర్టు ధర్మాసనం