తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రధాని అత్తగారినంటే.. ఎవరూ నమ్మలేదు'.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన సుధామూర్తి - రిషి సునాక్ అత్త ఎవరు

Sudha Murthy In Kapil Sharma Show : బ్రిటిష్‌ ప్రధాని రిషి సునాక్‌ అత్తగారినంటే.. లండన్‌లోని అధికారులు నమ్మలేదని తెలిపారు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి. ఓ టీవీ షోలో ఆమె ఈ విషయాన్ని బయటపెట్టారు. తన వైవాహిక జీవితం గురించి ఆమె ఈ షోలో పంచుకున్నారు. ఆ విషయాలేంటో ఓ సారి తెలుసుకుందామా మరి.

sudha murthy in kapil sharma show
sudha murthy in kapil sharma show

By

Published : May 15, 2023, 7:22 PM IST

Sudha Murthy In Kapil Sharma Show : ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్యగానే గాక.. రచయిత్రి, సమాజ సేవకురాలిగా ఎంతో మందికి సుపరిచితురాలు సుధామూర్తి. పైగా బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌కు ఆమె స్వయానా అత్త కూడా. అయినప్పటికీ సుధామూర్తి నిరాడంబరంగా ఉంటారు. కోట్లాది రూపాయల డబ్బు, పలుకుబడి ఉన్నా.. ఆమె కట్టుబొట్టూ చూస్తే సాధారణ మధ్య తరగతి మహిళలా ఉంటారు. అందుకేనేమో ఆమె బ్రిటన్ ప్రధాని అత్తగారినంటే యూకేలో ఎవరూ నమ్మలేదట. ఈ విషయాన్ని సుధామూర్తి స్వయంగా చెప్పారు. ఇటీవల ఆమె ప్రముఖ బాలీవుడ్‌ టాక్‌షో 'ది కపిల్ శర్మ షో' లో పాల్గొని.. తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.

'ది కపిల్ శర్మ షో'లో తన వస్త్రధారణ కారణంగా యూకేలో తనకు ఎదురైన అనుభవాన్ని సుధామూర్తి బయటపెట్టారు. 'కొద్ది రోజుల క్రితం నేను బ్రిటన్ వెళ్లాను. అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు నా రెసిడెన్షియల్‌ అడ్రస్​ గురించి ప్రశ్నించారు. లండన్‌లో ఎక్కడ ఉంటారు? అని అడిగారు. నాతో పాటు మా అక్క కూడా బ్రిటన్ వచ్చింది. నా కుమారుడు బ్రిటన్​లోనే ఉంటాడు. కానీ అతడి పూర్తి అడ్రసు నాకు తెలియదు. దీంతో నేను నా అల్లుడు, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ నివాసమైన 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ను అడ్రస్‌గా రాశాను. ఆ అడ్రస్ చూడగానే ఇమ్మిగ్రేషన్ అధికారి నన్ను ఎగాదిగా చూశారు. 'జోక్‌ చేస్తున్నారా?' అని అడిగారు. నేను నిజమే అని చెప్పినా వారు నమ్మినట్లు నాకు అనిపించలేదు. నాలాంటి సాదాసీదాగా ఉండే మహిళ ప్రధాని అత్తగారంటే అక్కడ ఎవరూ నమ్మలేదు' అని కొన్నాళ్ల క్రితం జరిగిన సంఘటనను సుధామూర్తి గుర్తుచేసుకున్నారు.

'ది కపిల్ శర్మ షో'లో సుధామూర్తి తన వైవాహిక జీవితం గురించి కూడా చెప్పారు. వివాహం కాకముందు తన భర్త నారాయణమూర్తిని మొదటిసారి చూసిన సందర్భాన్ని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆయన హీరోలా ఉంటారేమోనని తాను అనుకున్నట్లు సుధామూర్తి చెప్పారు. 'నారాయణ మూర్తి మా పెళ్లప్పుడు ఎంత బరువు ఉండేవారో.. ఇప్పటికీ అలాగే ఉన్నారు. నాకు వంట సరిగ్గా రాదు. అందుకే ఆయన అలా ఉండిపోయారు' అంటూ షోలో నవ్వులు పూయించారు సుధామూర్తి. ఈ షోలో సుధామూర్తితో పాటు బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌, నిర్మాత గునీత్‌ మోంగా కూడా పాల్గొన్నారు.

1978లో సుధామూర్తి, నారాయణమూర్తికి వివాహం అయ్యింది. వీరికి కుమార్తె అక్షతా (బ్రిటన్ ప్రధాన్ భార్య), కుమారుడు రోహన్‌ ఉన్నారు. సుధామూర్తి సేవలకు గానూ 2023లో కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది.

ABOUT THE AUTHOR

...view details