ఉన్న ఊరిని సొంత ఇంటిని వదిలి పొట్ట కూటి కోసం ఆ కుటుంబం వలస వెళ్లింది. తండ్రి చోలే బటూరే.. చిన్న దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు. ఆ సమయంలో జరిగిన ఓ ఘటన ఆ చిన్నారిని ఇప్పడు న్యాయమూర్తిని చేసింది. ఇది బిహార్ నుంచి దిల్లీకి వలన వెళ్లిన కమలేశ్ విజయగాథ. తన కళ్లెదుట జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ అడ్డుకోలేకపోయానే అని చిన్నబోయిన ఆ బాలుడి మనసులో మెదిలిన ఆలోచనే అతడిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది.
పొట్ట కూటి కోసం దిల్లీకి వలస...
అది బిహార్లోని మారుమూల ప్రాంతం. 1992వ సంవత్సరం. సహ్రాసా అనే ఊరిలో ఉన్న ఓ కుటుంబం దిల్లీకి వలస వెళ్లి అక్కడ ఓ చిన్న పూరింట్లో తమ ఆవాసాన్ని ఏర్పరుచుకుంది. పొట్ట కూటి కోసం ఆ ఇంటి పెద్ద చోలే బటూరే.. దుకాణాన్ని నడిపేవాడు. తండ్రికి చేదోడుగా అదే దుకాణంలో నాలుగేళ్ల కమలేశ్ పని చేసేవాడు.
ఆ ఒక్క ఘటనతో..
ఎర్రకోట వెనకాల ఉన్న గుడిసెలన్నింటిని ఖాళీ చేయించాలని వచ్చిన పోలీసులతో కమలేశ్ తండ్రికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో ఆయనపై ఓ పోలీసు చేయి చేసుకున్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న చిన్నారి కమలేశ్కు పట్టలేనంత కోపం వచ్చినప్పటికీ తను ఏమి చేయలేకపోయాడు. పోలీసుల కంటే జడ్జిలే గొప్పవారు అని ఆ సమయంలో తండ్రి అన్న మాటలు తన మనసులో బలంగా నాటుకుపోయాయి. అప్పుడే తాను జడ్జీ అవుదామని నిర్ణయించుకున్నాడు.
లా సెట్లో 64వ ర్యాంక్..
కానీ తన కుటుంబ పరిస్థితుల కారణంగా ఆ కల నెరవేర్చడం అంత సులువు కాలేదు. ఎంతో కష్టపడినప్పటికీ ఎన్నోమార్లు అతనికి నిరాశే మిగిలింది. అయినపట్టికీ వెనకడుగు వేయలేదు కమలేశ్. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో, తండ్రి సహకారంతో మెరుగ్గా సన్నద్ధమయ్యాడు. బిహార్లో న్యాయమూర్తుల నియామకం కోసం నిర్వహించిన 'జ్యుడిషియల్ సర్వీస్' పరీక్షలో 64వ ర్యాంక్ సాధించాడు. దీంతో కమలేశ్ కుటుంబసభ్యులతో పాటు సహ్రాసా గ్రామస్థులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.