తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మమతతో సుబ్రహ్మణ్య స్వామి భేటీ, ధైర్యవంతురాలంటూ ప్రశంసలు, మోదీపై ఫైర్ - సుబ్రహ్మణ్య స్వామి మోదీ

భాజపా నేత, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి బంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిశారు. ఈ సందర్భంగా దీదీపై ప్రశంసలు కురిపించారు. అంతకుముందు, మోదీపై విమర్శలు వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు.

Subramanian Swamy
సుబ్రహ్మణ్య స్వామి

By

Published : Aug 18, 2022, 10:48 PM IST

Subramanian Swamy News: కేంద్రంపై తరచూ విమర్శలు గుప్పించే బంగాల్ సీఎం మమతా బెనర్జీని భాజపా ఫైర్​బ్రాండ్ సుబ్రహ్మణ్య స్వామి కలిశారు. కోల్​కతాలోని సెక్రెటేరియట్​లో మమతతో స్వామి భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు ఇరువురు చర్చలు జరిపినట్లు సమాచారం. సీఎంను మర్యాదపూర్వకంగా కలిసేందుకు సుబ్రహ్మణ్య స్వామి వచ్చారని అధికార వర్గాలు చెప్పాయి.

మమతను కలిసినట్లు ట్విట్టర్​లో స్వామి వెల్లడించారు. ఆమెతో కలిసిన ఫొటోలను షేర్ చేశారు. ఈ సందర్భంగా దీదీపై ప్రశంసలు కురిపించారు. మమత చాలా ధైర్యం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. రాష్ట్రంలో కమ్యూనిస్టులపై మమత చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేంద్రంపై సుబ్రహ్మణ్య స్వామి సైతం తరచుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మమతను కలవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన రాజకీయంగా త్వరలో ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారేమోనన్న అనుమానాలు మొదలయ్యాయి.

'ఎన్నికల్లేవ్.. అంతా మోదీనే'
అంతకుముందు, భాజపా పార్లమెంటరీ బోర్డులో తాజాగా చోటుచేసుకున్న వ్యవస్థాగత మార్పులపై సుబ్రహ్మణ్య స్వామి విమర్శలు గుప్పించారు. ఆఫీస్‌ బేరర్లను నియమించేందుకు పార్టీ సంస్థాగత ఎన్నికలను దూరం పెట్టిందన్న ఆయన.. ప్రధాని మోదీ ఆమోదంతోనే సభ్యులంతా నామినేట్‌ అవుతున్నారని ఆరోపించారు. గతంలో ఆఫీస్‌ బేరర్ల నియామకాలన్నీ పార్టీలో ఎన్నికల ద్వారానే జరిగేవని స్వామి గుర్తుచేశారు.

'జనతా పార్టీ తొలినాళ్లలో (ఇప్పుడు భాజపా) ఆఫీస్‌ బేరర్ల పోస్టులను భర్తీ చేసేందుకు పార్టీ, పార్లమెంటరీ పార్టీ ఎన్నికలు జరిగేవి. పార్టీ నిబంధనలు కూడా ఇదే విషయాన్ని చెబుతాయి. కానీ, ప్రస్తుతం భాజపాలో ఎన్నికలనే మాటే లేదు. ఏ పోస్టుకు సభ్యుడిని నామినేట్‌ చేయాలన్నా అది మోదీ ఆమోదంతోనే జరుగుతోంది' అని పేర్కొంటూ స్వామి ట్వీట్‌ చేశారు. ఈ విషయంపై స్పందించిన భాజపా నేతలు మాత్రం.. పార్టీలో ఏ స్థానాన్ని భర్తీ చేయాలన్నా పార్టీ అధ్యక్షుడే నామినేట్‌ చేస్తారన్నారు. అనంతరం పార్టీ జాతీయ కార్యవర్గం లేదా ఇతర విభాగాలు వాటిని ఆమోదిస్తాయని.. పార్టీలో ఈ సంప్రదాయం ఎన్నోఏళ్లుగా కొనసాగుతోందని చెబుతున్నారు.

ఇవీ చదవండి:మిర్రర్ రైటింగ్​లో యువతి ప్రతిభకు రికార్డులు దాసోహం

డోలో 650 ప్రిస్క్రైబ్ చేసేందుకు వారికి రూ.వెయ్యి కోట్ల గిఫ్ట్స్​, సుప్రీం సీరియస్

ABOUT THE AUTHOR

...view details