RS Polls 2022: రాజ్యసభ ఎన్నికలతో రాజస్థాన్ రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. రాష్ట్రం నుంచి నాలుగు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఐదుగురు నామినేషన్ దాఖలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీ, రణ్‌దీప్ సుర్జేవా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. భాజపా తరఫున ఘన్శ్వామ్ తివారీ నామినేషన్ దాఖలు చేశారు. అయితే అనూహ్యంగా ఎస్సెల్ గ్రూప్ అధినేత, ఎంపీ సుభాశ్ చంద్ర కూడా రాజస్థాన్ నుంచి మళ్లీ పెద్దల సభకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. నామినేషన్ల సమర్పణకు చివరి రోజైన మంగళవారమే ఆయన నామినేషన్ దాఖలు. అయితే ఆయన భాజపా మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఒకవేళ సుభాశ్ చంద్ర గెలవాలంటే కచ్చితంగా మరికొంత మంది సభ్యుల మద్దతు అవసరమవుతుంది. మరి కాంగ్రెస్‌లో అసమ్మతి నేతల ఓట్లు సుభాశ్‌కు పడతాయా, లేక స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతిస్తారా తెలియాల్సి ఉంది. భాజపా మరోసారి కాంగ్రెస్‌లో చీలిక తెస్తుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
Rajasthan Rajyasabha Election: సుభాశ్ చంద్ర ప్రస్తుతం హరియాణా నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. గత ఎన్నికల్లోనూ భాజపా ఆయనకు మద్దతుగా నిలిచింది. ఇప్పుడు రాజస్థాన్ నుంచి పోటీ చేసేందుకు మద్దతు ఇస్తోంది. సుభాశ్ నామినేషన్‌కు ముందు రాజస్థాన్ మాజీ సీఎం, భాజపా నేత వసుందర రాజే ఆయనను అసెంబ్లీ లాబీలో కలిశారు. మరికొంత మంది భాజపా నేతలు కూడా కూడా అక్కడికి చేరుకున్నారు.
రాజస్థాన్ నుంచి ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీ, రణ్‌దీప్ సుర్జేవాలా వంటి సీనియర్లను అభ్యర్థులుగా ఎంపిక చేసింది కాంగ్రెస్. అయితే వీరంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారు కావడం వల్ల సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసమ్మతి వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లో చాలా మంది నాయకులు ఉండగా.. ఇతర రాష్ట్రాల వారికి ఎందుకు అవకాశం ఇస్తున్నారని మండిపడ్డారు. సీఎం అశోక్ గహ్లోత్ సలహాదారుడు, స్వతంత్ర ఎమ్మెల్యే సన్యం లోధా ఈ విషయంపై బాహాటంగానే విమర్శలు గుప్పించారు.
దీన్ని అవకాశంగా తీసుకున్న భాజపా.. తమ అభ్యర్థి ఘన్శ్వామ్ తివారీతో పాటు మరో అభ్యర్థిని కూడా బరిలోకి దింపుతామని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే సుభాశ్ చంద్రకు మద్దతు ఇస్తోంది. అయితే ఆయన కూడా హరియాణాకు చెందిన వారు కావడం వల్ల స్థానికేతరుడి కిందకే వస్తారు. మరి భాజపా వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి.