Students protest in Maharastra: కరోనా కారణంగా గత రెండేళ్లుగా పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నా ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. మహారాష్ట్రలో ఆన్లైన్ తరగతులు నిర్వహించిన విద్యాశాఖ.. ఇటీవల 10, 12 తరగతుల బోర్డు పరీక్షల షెడ్యూల్ను ప్రకటించింది. మార్చి 4 నుంచి 12వ తరగతి, మార్చి 15 నుంచి 10వ తరగతి పరీక్షలు జరుగుతాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రొఫెసర్ వర్షా ఏక్నాథ్ గైక్వాడ్ ప్రకటించారు. పరీక్షలు ఆఫ్లైన్లోనే నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఈ నిర్ణయాన్ని విద్యార్థులు వ్యతిరేకించారు. ఆన్లైన్ తరగతులు అరకొరగానే జరిగాయని, సిలబస్ పూర్తి కాకపోవటంతో పాటు సరిగ్గా అర్థం చేసుకోలేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుణెకు చెందిన కొంత మంది విద్యార్థులు నగరంలోని విద్యాశాఖ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన చేపట్టారు. పరీక్షలను ఆన్లైన్లో చేపట్టాలి లేదా పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు.. విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ నివాసం ముందు పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా.. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి
"విద్యార్థుల భద్రత, ఆరోగ్యంపై తరుచూ చర్చిస్తున్నాం. మాతో చర్చించాలని విద్యార్థులను కోరుతున్నా. దాని ద్వారా నిర్ణయం తీసుకోవచ్చు. రెండేళ్లు విద్యార్థులు నష్టపోయినదానిని దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకున్నాం."
- ప్రొఫెసర్ వర్షా ఏక్నాథ్ గైక్వాడ్, మహారాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి.