పడవల్లో స్కూళ్లకు వెళ్తున్న విద్యార్థులు Assam floods 2022: అసోంలో భారీ వర్షాలకు వందల గ్రామాలు నీటమునిగాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడటం వల్ల అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. అయితే ఈ వరదల్లో కూడా పాఠశాలలకు వెళ్తున్నారు ధీమాజీ జిల్లా బిష్ణుపుర్ ప్రాంతానికి చెందిన విద్యార్థులు. పడవల సాయంతో అక్కడికి బడికి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ స్కూల్లో మొత్తం 29 మంది విద్యార్థులు ఉన్నారని.. వరదల కారణంగా స్కూల్‌కు వచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
27 జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిన వరద 17 వందల 90 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెంచేసింది. సుమారు 7 లక్షల 17 వేల మంది ప్రజలపై వరద ప్రభావం చూపినట్లు అధికారులు తెలిపారు. కొపిలీ, దిసాంగ్, బ్రహ్మపుత్ర నదులు ప్రమాదకరస్థాయిని దాటి ప్రవహిస్తుండగా.. ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కొపిలీ నది పొంగిపొర్లడం వల్ల నాగావ్ జిల్లాలోని పలు గ్రామాలు వరద బారినపడ్డాయి. వరదల ధాటికి వేలాది ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరికొన్ని ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
వరద బీభత్సానికి ప్రధాన రహదారులు కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. స్తంభాలు విరిగిపడి చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వందలాది గ్రామాలు వరద ముంపులో చిక్కుకుపోయాయి. తాగునీరు, ఆహారం లేక అలమటిస్తున్నారు. వీరికి ఆహారాన్ని అందించడం కూడా చాలా కష్టమవుతోందని అధికారులు తెలిపారు. అతి కష్టం మీద జల దిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాలకు చేరుకుంటున్న సహాయ సిబ్బంది వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కానీ పునరావాస కేంద్రాలకు భారీగా వస్తున్న ప్రజలకు ఆహార నిల్వలు అందించడం అసోం ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది.
అసోం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర విపత్తు స్పందనా దళాలు సహా, సైన్యం, అసోం రైఫిల్స్ బలగాలు వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటివరకు 56 పైగా వరద ప్రభావిత ప్రాంతాల్లో రవాణా మార్గాలు పునరుద్ధరించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. మరోవైపు పలువురు మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్తున్నారు. వరదల బీభత్సంపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో చర్చించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఇదీ చూడండి :బిహార్‌పై వరుణుడి పంజా.. 27 మంది మృతి