Students Crossing Dangerous Rope Bridge : మధ్యప్రదేశ్ అశోక్‌నగర్ జిల్లా తుమెన్ గ్రామంలోని విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బందిపడుతున్నారు. స్కూల్‌కు చేరుకునే క్రమంలో త్రివేణి నది దాటేందుకు చెక్కతో చేసిన ప్రమాదకరమైన తాడు వంతెనను దాటాల్సి వస్తోంది. పాఠశాలకు వెళ్లేందుకు మరో మార్గం లేదు. దీంతో స్కూల్‌కు వెళ్లాలంటే ఐదు కిలోమీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. పాఠశాలకు వెళ్లేందుకు ఎక్కువ సమయం అవుతుండడం వల్ల.. ఈ తాత్కాలిక వంతెనే వారికి దిక్కవుతోంది. చాలాసార్లు పడతామేమో అని భయం వేస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాహసం చేస్తేనే స్కూల్‌కు.. అడుగు తప్పితే అపాయమే.. దెబ్బతిన్న వంతెనపై విద్యార్థుల పాట్లు - త్రివేణి నది తాడు వంతెనతో విద్యార్థుల కష్టాలు
మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామంలో విద్యార్థులు చదువు కోసం తమ ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. పాఠశాలకు వెళ్లేందుకు నానాపాట్లు పడుతున్నారు. ప్రమాదకరంగా ఉన్న ఓ తాడు వంతెనపై రోజూ సాహసాలు చేస్తూ పాఠశాలకు వెళ్తున్నారు. దాటుతున్న సమయంలో వంతెన ప్రమాదకరంగా ఊగుతోందని విద్యార్థులు వాపోతున్నారు.
త్రివేణి నదిపై ఈ వంతెన చాలా వదులుగా ఉందనీ, నడుస్తుంటే ప్రమాదకరంగా ఊగుతోందని విద్యార్థులు భయపడుతున్నారు. రెండు చివర్లలో తాళ్లతో వదులుగా కట్టిన చెక్క పలకలపై జాగ్రత్తగా అడుగులు వేయాలని, దీని వల్ల చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. దానిపై ఏర్పాటు చేసిన చెక్కలు, కర్రల్లో కొన్ని ఊడిపోయి నీటిలో పడిపోతున్నాయి. నిత్యం ప్రజలు నడిచే ఈ మార్గం కోసం కొత్త వంతెన నిర్మాణం చేపట్టాలని అధికార యంత్రాంగానికి ప్రతిపాదనలు పంపినట్లు.. తూమెన్ గ్రామ సర్పంచ్ తెలిపారు. అయితే ఇప్పటి వరకు వారు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరో వైపు వంతెన పరిస్థితిపై గ్రామస్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు కురిసే సమయంలో.. తమ పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని అధికారుల తీరుపై మండిపడ్డారు. పిల్లల చదువుకు వంతెనను కూడా నిర్మించలేరా అని ప్రశ్నించారు.
బడికి వెళ్లాలంటే.. నీటిలో నడవాల్సిందే..
ఇదిలా ఉంటే.. కర్ణాటక రాయ్‌చూర్ జిల్లా దేవరగుడి విద్యార్థుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. దేవరగుడి గ్రామంలో పాఠశాల లేకపోవడం వల్ల పక్కనే ఉన్న సింధునూర్ నగరానికి వెళ్లి చదువుకుంటున్నారు విద్యార్థులు. కానీ అక్కడికి వెళ్లాలంటే నీటి ప్రవాహాన్ని దాటి వెళ్లడం తప్ప మరో మార్గం లేదు. దీంతో బిక్కుబిక్కుమంటూ నిత్యం నీటి ప్రవాహన్ని దాటుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని వంతెన నిర్మించాలని కోరుతున్నారు.ఈ ఘటన గతేడాది జులైలో వెలుగుచూసింది. ఈ వీడియో చూడాలంటే లింక్‌పై క్లిక్ చేయండి.