Student Beaten By Classmates : కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలో ఓ విద్యార్థిని చితకబాదారు తోటి విద్యార్థులు. తమ వర్గానికి చెందిన విద్యార్థినితో మాట్లాడుతున్నాడని దారుణంగా కొట్టారు. జిల్లాలోని సుళ్యా తాలుకాలోని ఓ కళాశాలలో మంగళవారం జరిగిందీ ఘటన. బాధితుడు సుళ్యా తాలుకాలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. అదే కళాశాలలో చదువుతున్న మరో వర్గానికి చెందిన విద్యార్థినితో సన్నిహితంగా ఉంటున్నాడు. ఆమెతో తరచూ మాట్లాడేవాడు.
దీనిని గమనించిన అమ్మాయి వర్గానికి చెందిన విద్యార్థులు ఆగ్రహానికి గురయ్యారు. మాట్లాడతామంటూ బాధితుడిని కళాశాల మైదానానికి పిలిపించారు. అతడు రాగానే.. కర్రలతో కొట్టడం మొదలుపెట్టారు. తమ వర్గానికి చెందిన విద్యార్థితో మాట్లాడితే చంపేస్తామంటూ బెదిరించారు. గాయాలపాలైన బాధితుడు ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు చెప్పాడు. అనంతరం అతడ్ని సుళ్యా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించిన తల్లిదండ్రులు.. ఏడుగురు విద్యార్థులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఇంటి ముందు ఫోన్ మాట్లాడుతున్నాడని యువకుడిని కాల్చిన యజమాని: తన ఇంటి ముందు ఫోన్ మాట్లాడుతున్నాడని ఓ యువకుడిపై కాల్పులు జరిపాడు మరో యువకుడు. ఈ ఘటన దిల్లీలోని గాజియాబాద్‌లో జరిగింది. సిహాని గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ యువకుడు బైక్‌పై వెళ్తుండగా ఫోన్ వచ్చింది. దీంతో రోడ్డు పక్కన నిలిపి మాట్లాడుతున్నాడు. అతడిని గమనించిన ఇంటి యజమాని.. తన ఇంటి ముందు కాకుండా ముందుకు వెళ్లి మాట్లాడుకోవాలని సూచించాడు. తాను చెప్పినా వినకుండా మాట్లాడుతున్నాడని ఆగ్రహించిన నిందితుడు.. తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. బుల్లెట్ యువకుడి భుజానికి తగలడం వల్ల తీవ్ర రక్తస్రావం జరిగింది. అనంతరం బాధితుడిని ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉంది. దీనిపై కేసు నమోదు చేసకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
మూడు నెలల కింద రేప్.. మైనర్‌కు గర్భం: ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్‌పై అత్యాచారానికి పాల్పడ్డాడు పక్కింటి వ్యక్తి. బాలికపై గతంలో అత్యాచారానికి పాల్పడగా.. తాజాగా గర్భం దాల్చడం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన దిల్లీలోని నారాయణ గ్రామంలో జరిగింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.