మన దేశ అభివృద్ధిలో రైతులది కీలక పాత్ర. దాదాపు 140 కోట్ల మందికి ఆహారం అందించేది ఈ రంగమే. దేశ జనాభాలో మూడింట రెండొంతుల మంది ఈ రంగంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అలాంటి రంగంలో చెమటోడ్చే రైతులు.. నీళ్లు లేకపోవడం, వాతావరణ మార్పుల, నకిలీ విత్తనాలు తదితర కారణాల వల్ల నష్టాల పాలవుతున్నారు. చాలా మంది అందులోంచి తేరుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కానీ, ఓ రైతు మాత్రం భిన్నంగా ఆలోచించి తన ఆర్థిక స్థితి మెరుగుపరుచుకున్నాడు. వ్యవసాయానికి అనుబంధంగా స్టడ్ ఫామ్‌ను నిర్వహిస్తూ రూ. లక్షల్లో సంపాదిస్తున్నాడు. అతడే పంజాబ్‌కు చెందిన రైతు గుర్తేజ్ సింగ్!
బఠిండా జిల్లాలోని నరువానా గ్రామానికి చెందిన రైతు గుర్తేజ్ సింగ్. గుర్తేజ్ కూడా అందరిలాగే వ్యవసాయం చేసేవాడు. అందులో వచ్చే డబ్బులు అతడికి సరిపోలేదు. దీంత వ్యవసాయానికి అనుబంధంగా ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో స్టడ్ ఫామ్‌ను నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. మొదట లక్షన్నర రూపాయలు ఖర్చు చేసి రెండు ఆడ గుర్రాలను తీసుకొచ్చాడు. వాటికి పుట్టిన పిల్లలను విక్రయించి క్రమంగా ఫామ్‌ను పెంచాడు. గుర్రాలకు మంచి షెడ్లు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు అతడి వద్ద 8 గుర్రాలు ఉన్నాయి.
'ఖర్చు తక్కువ.. లాభం ఎక్కువ!'.. రైతు గుర్రాల బిజినెస్.. రూ.లక్షల్లో సంపాదన ఖర్చు తక్కువ.. లాభం ఎక్కువ..
స్టడ్ ఫార్మింగ్ వ్యాపారంలో ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని రైతు గుర్తేజ్ సింగ్ తెలిపాడు. రోజుకు ఒక్కో గుర్రానికి మేత ఖర్చు రూ.150 నుంచి 200 మాత్రమే అవుతుందని వెల్లడించాడు. గుర్రాలు శెనగలు, జీలకర్ర, నెయ్యి తింటాయని.. వీటిని రైతులే పండించవచ్చని పేర్కొన్నాడు. అయితే, పంజాబ్‌లో ప్రతినెల గుర్రాల సంత జరుగుతుంది. అక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు. అక్కడ తన గుర్రాలను విక్రయిస్తాడు గుర్తేజ్. ఇక్కడ ఒక్కో గుర్రం దాదాపు రూ. 15 నుంచి 20 లక్షల వరకు పలుకుతుంది. అయితే, వివిధ జాతులను బట్టి గుర్రాల ధర వేరుగా ఉంటుంది.
కాగా, గుర్రాలకు అంత సులభంగా రోగాలు రావని.. అదే స్టడ్ ఫార్మింగ్‌లో ఉన్న మంచి విషయమని గుర్తేజ్ సింగ్ చెప్పాడు. గుర్రాలకు ఏ సమస్య వచ్చినా.. 20 నుంచి 25 నిమిషాల్లో ఫామ్ చేరుకుని చికిత్స చేసే వైద్యులు చాలా మంది ఉన్నారని తెలిపాడు. గుర్రాలు వ్యాధుల బారిన పడకుండా చర్యలు తీసుకుంటానని.. అందుకోసం సకాలంలో టీకాలు వేయిస్తానని వెల్లడించాడు. వ్యవసాయ అనుబంధ వ్యాపారాలకు సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రభుత్వం స్టడ్ ఫార్మింగ్‌కు కూడా సబ్సిడీ ఇస్తే బాగుంటుందని గుర్తేజ్ అన్నాడు. దీని వల్ల పంటలకే పరిమితం కాకుండా ఇలాంటి వ్యాపారాలు చేసుకుంటే రైతులకు ప్రయోజనం ఉంటుందని చెప్పాడు.